పక్కా స్కెచ్‌తోనే పోలీసులపై దాడి.. గొడవ పడేందుకే టీడీపీ కేడర్‌ ఇక్కడికి , వదలేది లేదు : చిత్తూరు ఎస్పీ

Siva Kodati |  
Published : Aug 04, 2023, 07:38 PM IST
పక్కా స్కెచ్‌తోనే పోలీసులపై దాడి.. గొడవ పడేందుకే టీడీపీ కేడర్‌ ఇక్కడికి , వదలేది లేదు  : చిత్తూరు ఎస్పీ

సారాంశం

పుంగనూరు, అంగళ్లులో పోలీసులపై పక్కాప్లాన్ ప్రకారం దాడి జరిగిందని ఆరోపించారు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి. రాళ్లదాడిలో మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయని , టీడీపీ కేడర్‌పై కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. 

చిత్తూరు జిల్లా పుంగనూరు, అంగళ్లులో జరిగిన విధ్వంసక ఘటనలపై జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే గొడవ చేశారని ఆయన ఆరోపించారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో 2 వేల మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారని రిషాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసులపై పక్కాప్లాన్ ప్రకారం దాడి జరిగిందని ఆయన తెలిపారు. వాళ్లు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి వుందని.. కానీ వారు అలా వెళ్లకుండా పుంగనూరులోకి వచ్చారని ఎస్పీ చెప్పారు. దీంతో పుంగనూరులోకి రాకుండా టీడీపీ క్యాడర్‌ను అడ్డుకున్నామని రిషాంత్ రెడ్డి వెల్లడించారు.

Also Read: అంగళ్లులో రాళ్ల దాడి టీడీపీ పనే.. నిగ్రహంతో వున్నాం, అందుకే తిరుగుతున్నారు : సజ్జల వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో వారంతా ఒక్కసారిగా పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగారని ఎస్పీ తెలిపారు. 2 పోలీస్ వాహనాలను తగులబెట్టారని.. ఈ ఘటనలో 14 మంది పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయని ఎస్పీ పేర్కొన్నారు. రాళ్లదాడిలో మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయని రిషాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని.. దీని వెనుక ఎంత పెద్దవాళ్లున్నా వదిలిపెట్టేది లేదని ఎస్పీ తేల్చిచెప్పారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసుపై కాదని ఆయన హితవు పలికారు. గొడవ పెట్టుకునేందుకే టీడీపీ కేడర్ ఇక్కడికి వచ్చారని ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించారు.

అంతకుముందు అంగళ్లులో చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు. టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను చించేసిన వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపైనా రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దేవేంద్ర అనే ఎంపీటీసీ సహా పలువురు నేతలు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. 

ALso Read: రణరంగంలా పుంగనూరు : రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. రాళ్లు, బీర్ బాటిల్స్‌తో దాడి, పోలీస్ వాహనాలకు నిప్పు

దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని ఆరోపించారు. డీఎస్పీ తన యూనిఫామ్ తీసేయాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాంబులకే తాను భయపడలేదని.. రాళ్లకు భయపడతానా అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి చూసుకుందాం.. పులివెందులకే వెళ్లానని, తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానని చంద్రబాబు పేర్కొన్నారు. 

పోలీసుల అండతోనే వైసీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఎవరి జోలికి తాము వెళ్లమని.. మా జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. పుంగనూరుకు వెళ్తున్నానని.. అక్కడి పుడింగి సంగతి తేలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ రావణాసురుడిలాంటి ఎమ్మెల్యే వున్నాడని.. ఇలాంటి వాళ్లను భూస్థాపితం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసులు ఎవరికి ఊడిగం చేస్తున్నారని.. అంగళ్లు ఘటనపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!