చంద్రబాబు, పవన్ బాటలోనే జగన్ ... బిజెపికే ఫుల్ సపోర్ట్..!! 

By Arun Kumar PFirst Published Jun 25, 2024, 11:27 PM IST
Highlights

ఒక్క ఓటమితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారయ్యింది. చివరకు తమను ఓడించిన పార్టీకే మద్దతివ్వాల్సిన పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పాార్టీకి వచ్చింది. 

YSR Congress Party : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఏ కూటమి చేతిలో అయితే చిత్తుగా ఓడిపోయారో అదే కూటమికి కేంద్రంలో మద్దతిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.  లోక్ సభ స్పీకర్ ఎన్నికల్లో బిజెపి నేత‌ృత్వంలోని ఎన్డిఏ కూటమికే వైఎస్ జగన్ పార్టీ మద్దతిస్తోంది. ఇలా వైసిపి నలుగురు ఎంపీ ల మద్దతు కూడా ఎన్డిఏకు దక్కింది. 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కలిసి పోటీచేసాయి. ఈ కూటమి చేతిలో వైసిపి ఘోర ఓటమిని చవిచూసి అధికారాన్ని కోల్పోయింది. దీంతో అటు కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వంలో టిడిపి... ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్యం అయ్యాయి. ఇలా తమను ఓడించిన ఎన్డిఏకే వైసిపి మద్దతివ్వడం ఆసక్తికర పరిణామం. 

Latest Videos

ఓడించిన ఎన్డిఏకే జగన్ మద్దతెందుకు..: 

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆసక్తికర తీర్పు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన వైసిపి ఈసారి కేవలం 11 సీట్లకు పరమితం చేసారు...  ఆనాడు తిరస్కరించిన టిడిపి మళ్లీ నెత్తిన పెట్టుకున్నారు. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏకంగా 164 ఎమ్మెల్యే, 21 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. 

ఈ ఓటమి తర్వాత జగన్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఇలా అధికారాన్ని కోల్పోగానే అలా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ప్రజా ధనం దుర్వినియోగం చేసారని, ప్రభుత్వ ఫర్నీచర్ సొంతానికి వాడుకున్నాడని, అధికారంలో వుండగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడంటూ జగన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా జగన్ ఎక్కడ దొరుకుతాడా... ఎలా ఆటాడుకుందామా అని ఎదురుచూస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 

అయితే ఇప్పటికే జగన్ పై అనేక అవినీతి కేసులున్నాయి...అవన్ని వివిధ కోర్టుల్లో విచారణలో వున్నాయి. గత ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో వున్నారు... కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా వున్నారు కాబట్టి ఈ కేసుల్లో అంత సీరియస్ రియాక్షన్ చూడలేదు. కానీ ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఏ క్షణాన ఏమైనా జరగొచ్చు. 

కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ మొదటి టార్గెట్ గా వైఎస్ జగన్ వున్నాడు. ఇక కేంద్ర ప్రభుత్వంతోనూ పెట్టుకుంటే తనపని అయిపోయినట్లేనని జగన్ కు తెలుసు. అందువల్లే వైసిపి ఓడించేందుకు టిడిపి, జనసేన పార్టీలతో జతకట్టినా ఆయన బిజెపికే మద్దతుగా నిలిచారు. స్పీకర్ ఎన్నికల్లో వైసిపికి చెందిన నలుగురు ఎంపీలు బిజెపి పక్షానే నిలవనున్నారు.  

 


 

 

click me!