వైఎస్ వివేకా హత్య కేసు.. కోర్టులో తులసమ్మ వాంగ్మూలం నమోదు..

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 4:03 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పులివెందుల కోర్టు మెజిస్ట్రేట్ ముందు తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ వేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ఆరుగురుని సీబీఐ విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తులసమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

వివేకానందరెడ్డి అల్లుడైన చిన బావమరిది రాజశేఖర్‌రెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ విచారించే విధంగా ఆదేశించాలని కోరారు. ఈ హత్యలో వారి ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత పులివెందుల కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది.

ఇక, తులసమ్మ పిటిషన్‌లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాజశేఖర్‌రెడ్డి, శివ ప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, బీటెక్ రవి, రాజేశ్వర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ల హస్తం ఉందని ఆరోపించారు. వివేకానందరెడ్డి షేక్ షమీమ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారని.. అది ఆయన కుటుంబంలో విబేధాలకు కారణమైందని ఆరోపించారు. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డికి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తిగా లోపభూయిష్టంగా, పక్షపాతంగా, అన్యాయంగా ఉందని ఆరోపించారు. హత్యలో నిజమైన నిందితులను రక్షించడానికి సాక్ష్యాల సేకరణ ప్రక్రియ మొత్తాన్ని అణగదొక్కడం, విధ్వంసం చేయడం జరుగుతున్నాయని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాష్‌రెడ్డి వారసత్వంగా రావాల్సిన తమ సంపదను కోల్పోయామనే ఆందోళన చెందుతున్నారని ఆమె అన్నారు. మరో ఇద్దరు ఎం రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బిటెక్ రవి, అనంతపురంకు చెందిన వైజీ రాజేశ్వర రెడ్డిలకు వివేకానంద రెడ్డితో రాజకీయ విభేదాలు ఉన్నాయని చెప్పారు. వైజీ రాజేశ్వర రెడ్డి అతని ప్రత్యర్థిని వైసీపీ గూటికి తీసుకురావాలని ప్రయత్నించడంతో వివేకానందరెడ్డిపై పగ పెంచుకున్నారని ఆరోపించారు. 

వివేకానంద షమీమ్‌ను వివాహం చేసుకున్న తరువాత అతని భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత.. ఆయనను వదిలిపెట్టమని షమ్మెమ్‌ను బెదిరించడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. షమీమ్‌కు జన్మించిన కుమారుడిని తన చట్టబద్ధమైన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానంద రడ్డి అతని బంధువులు, స్నేహితులకు తెలియజేయడంతో ఆయన కుటుంబంతో అతని సంబంధాలు మరింత క్షీణించాయని ఆరోపించారు.

రాజశేఖర్, శివప్రకాష్‌లు వివేకానంద రాజకీయ వారసులు కావాలని ఆశించారని.. వారు కూడా ఆయనపై పగ పెంచుకున్నారని తులసమ్మ పిటిషన్‌లో పేర్కొన్నారు. పులివెందులకు చెందిన పరమేశ్వర రెడ్డికి వివేకానందతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆరోపించారు. బెంగళూరులో భూ ఒప్పందం ద్వారా వచ్చిన సొమ్ములో తనకు వాటా ఇవ్వనందుకు వివేకానందపై పగ పెంచుకున్నాడని  చెప్పారు. వివేకానంద కదలికలపై సమాచారం తెలుసుకునేందుకు పులివెందులకు చెందిన ఎన్ ప్రసాద్‌ను ఇతర నిందితులు మోహరించినట్లు ఆమె పిటిషన్‌లో తెలిపారు. 

click me!