వైఎస్ వివేకా కేసు.. సీబీఐ ఎదుట హాజరైన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి

By Siva KodatiFirst Published Apr 25, 2023, 6:02 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో వివేకా రెండో భార్య షమీమ్ చేసిన ఆరోపణలతో పాటు వివేకా రాసిన లేఖ గురించి వీరిద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. లేఖను సాయంత్రం వరకు ఎందుకు గోప్యంగా వుంచారని ప్రశ్నించినట్లుగా సమాచారం. 

కాగా.. వివేకా కేసుకు సంబంధించి గత శనివారం కూడా రాజశేఖర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. షమీమ్ సీబీఐ అధికారులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ వెలుగులోకి రావడంతో రాజశేఖర్ రెడ్డి సీబీఐ అధికారులను కలవడం చర్చనీయాంశమైంది. రాజశేఖర్ రెడ్డి, అతని సోదరుడు తనను చాలా సార్లు బెదిరించారని షమీమ్ సీబీఐ అధికారులకు తెలిపిన సంగతి తెలిసిందే.  అయితే దాదాపు రెండు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు సీబీఐ అధికారులు. సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఆయనను విచారించారు. 

Latest Videos

ALso Read: వివేకా రెండో భార్య ఆరోపణలు.. సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, ఏం జరుగుతోంది..?

కాగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన రెండో భార్యగా చెబుతోన్న షమీమ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. తనకు , వివేకాకు 2010లో వివాహం జరిగిందని అయితే మా పెళ్లి వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదన్నారు. 2015లో తమకు కుమారుడు షెహన్‌షామ్ పుట్టినట్లుగా ఆమె చెబుతున్నారు. అయితే వివేకా బావమరిది శివప్రకాష్ రెడ్డితో పాటు వివేకా కుమార్తె సునీత కూడా తనను దూరంగా వుండాల్సిందిగా బెదిరించారని షమీమ్ పేర్కొన్నారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారని.. చివరికి చెక్ పవర్ కూడా తీసేశారని ఆమె ఆరోపించారు. 

వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్‌కు, వివేకా పదవిపై శివప్రకాష్ రెడ్డికి ఆశ వుండేదని షమీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య జరగడానికి కొద్దిగంటల ముందు కూడా తాను వివేకాతో మాట్లాడినట్లు ఆమె తెలిపారు. చెక్ పవర్ తీసేయడంతో వివేకా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని షమీమ్ చెప్పారు. బెంగళూరు ల్యాండ్ సెటిల్‌మెంట్ ద్వారా రూ.8 కోట్లు వస్తాయని వివేకా తనతో చెప్పినట్లు షమీమ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. మరి దీనిపై వివేకా కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

షమీమ్ 2005 నుంచి ఉద్యోగం వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డీస్ ల్యాబ్ లో ఉద్యోగం కోసం వివేకానంద రెడ్డి సిఫారసు లేఖ ఇచ్చారని, అయినా కూడా తనకు ఉద్యోగం రాలేదని ఆమె తన వాంగ్మూలంలో చెప్పినట్లు టీవీ చానెల్స్ వార్తాకథనాలు చెబుతున్నాయి. 

click me!