అవినాష్ రెడ్డి తల్లి సర్జరీపై తప్పుడు సమాచారం.. చర్యలు తీసుకోండి: హైకోర్టులో సునీత మెమో

By Sumanth KanukulaFirst Published May 31, 2023, 2:38 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి  తెలిసిందే.ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఈరోజు హైకోర్టులో మెమో దాఖలు చేశారు.

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి  తెలిసిందే. ఈ సందర్భంగా పలు షరతులను కూడా హైకోర్టు విధించింది. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి ఈరోజు హైకోర్టులో మెమో దాఖలు చేశారు. అవినాష్ రెడ్డి తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని సునీత న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్ తల్లికి ఎలాంటి సర్జరీ జరగలేదని..  అందువల్ల అతని న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని సునీత దాఖలు మెమోలో కోరారు. 

అయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది.. అవినాష్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమెను అవినాశ్ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ అనారోగ్యం గురించి తప్పైతే చర్యలు తీసుకోవచ్చని అవినాష్ లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే సునీత మెమో దాఖలు  చేశారు. అయితే ఈ మెమోను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. 

ఇదిలా ఉంటే.. అవినాస్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది. అరెస్టు చేసినట్లయితే రూ. 5లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదని షరతు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టం చేసింది. జూన్‌ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉ. 10 నుంచి సా. 5గంటల వరకు సీబీఐ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని అవినాష్‌ను ఆదేశించింది. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 
 

click me!