వైఎస్ వివేకా హత్య కేసు.. ఏప్రిల్ 15 కల్లా దర్యాప్తును పూర్తి చేస్తామని సుప్రీంకు తెలిపిన సీబీఐ..

By Sumanth KanukulaFirst Published Mar 29, 2023, 1:19 PM IST
Highlights

మజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 15 కల్లా పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది.

మజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఏప్రిల్ 15 కల్లా పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత విచారణలో సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసులో విచారణ అధికారిని మార్చాలని లేకపోతే మరో అధికారిని నియమించాలని చెప్పింది. 

అయితే ఈరోజు విచారణలో భాగంగా.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును  కొనసాగిస్తున్న రామ్‌సింగ్‌ను కొనసాగిస్తున్నట్టుగా సీబీఐ తెలిపింది. రాంసింగ్‌తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది. అయితే రాంసింగ్‌ను దర్యాప్తు అధికారిగా కొనసాగించడంపై న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా అభ్యంతరం తెలిపారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్‌ను కొనసాగించడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ఇక, ఈ కేసును దర్యాప్తును ఏప్రిల్ 15కల్లా పూర్తి చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల కేసు దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని సీబీఐ చెప్పింది. 

అయితే ఈలోగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన  భార్య తులసమ్మ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ  క్రమంలోనే ఆ విషయాన్ని పరిశీలిస్తామని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. అయితే సుప్రీం ధర్మాసనం ఏ విధమైన ఉత్తర్వులు జారీ చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 

 

click me!