వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది.. సీబీఐ

Published : May 03, 2023, 04:59 PM IST
వివేకా హత్య కేసు: అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉంది.. సీబీఐ

సారాంశం

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ  హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక  పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ  హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు  చేసిన సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి పిటిషన్‌పై ఇటీవల కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ.. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. అవినాష్ రెడ్డి దురుద్దేశపూర్వకంగానే దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది. అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.  

సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి సమాధానాలు దాటవేశారని.. దర్యాప్తును తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇచ్చారని సీబీఐ కౌంటర్‌లో పేర్కొంది. సీబీఐ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. హత్యా స్థలంలో ఆధారాలు చెరిపివేయడం కుట్రలో భాగమేనని ఆరోపించింది.  ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ముందుకు రావడం లేదని పేర్కొంది. ఆయన అనుచరుల వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోంది. 

‘‘భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ర్యాలీలు జరపడం సాక్షులను ప్రభావితం చేయడమే. అవినాష్ రెడ్డిపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. హత్యకు వినియోగించిన గొడ్డలి ఎక్కడుందో కస్టడీ విచారణలో తెలుసుకోవాలి. హత్యకు రూ. 4కోట్ల లావాదేవీలపై అవినాశ్‌రెడ్డి విచారణలో తేల్చాలి. సునీల్ యాదవ్‌తో అవినాశ్‌రెడ్డికి సంబంధమేంటో తెలియాలి. హత్య జరిగిన రోజున అవినాశ్‌రెడ్డి ఇంటికి సునీల్ యాదవ్ ఎందుకెళ్లాడో తేల్చాల్సి ఉంది. మార్చి 15న అవినాశ్‌రెడ్డి ఎక్కడెక్కడున్నారో నిర్ధారించుకోవాల్సి ఉంది. 

నేరాన్ని  ఆయనపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తామన్నారని గంగాధర్ రెడ్డి చెప్పారు. అందులో నిజం తేలాలి. దస్తగిరి ఓబుల్ రెడ్డి, భరత్ యాద్ ఎందుకు కలిశారో తెలియాలి. ఈ హత్యలో సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాష్‌రెడ్డికి ప్రమేయంపై ఆధారాలు లేవు. వివేకానందరెడ్డి షమీమ్‌ను పెళ్లిచేసుకోవడం శివప్రకాశ్‌రెడ్డికి ఇష్టంలేదు. షమీమ్‌తో పెళ్లికి వివేకా హత్యకు సంబంధం లేదు. హత్య స్థలంలో లభించిన లేఖను దాచిపెట్టడంలో దురుద్దేశం కనిపించట్లేదు. సునీత, రాజశేఖర్‌రెడ్డిలు వివేకా ఇంటికి రాగానే ఎస్పీ సమక్షంలో లేఖను పోలీసులకు ఇచ్చారు’’ అని సీబీఐ కౌంటర్‌లో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు