వైఎస్ వివేకా హత్య కేసు: ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడి తల్లి హెచ్చరిక

By telugu teamFirst Published Aug 10, 2021, 8:02 AM IST
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. తన కొడుకును విడుదల చేయకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

కడప: మాజీ మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ తల్లి సావిత్రమ్మ సోమవారం రాత్రి పులివెందులలో మీడియాతో మాట్లాడారు. సునీల్ యాదవ్ ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. 

తమ కుమారుడిని 24 గంటల లోపల విడుదల చేయకపోతే తమ కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటారని సావిత్రమ్మ హెచ్చరించారు. తమ కుమారుడు సునీల్ యాదవ్ ఏ విధమైన నేరం కూడా చేయలేదని ఆమె అన్నారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడని, ఎక్కడికీ వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు. 

వివేకా హత్య జరిగిన తర్వాత అందరిలాగానే తన కుమారుడు కూడా వెళ్లాడని ఆమె చెప్పారు. వివేకానంద రెడ్డి తమకు దేవుడిలాంటివాడని ఆమె చెప్పారు. అందుకే సునీల్ యాదవ్ వివేకానంద రెడ్డితో ఉన్నాడని అన్నారు. వివేకానంద రెడ్డి రెండు సార్లు తమ ఇంటికి కూడా వచ్చారని ఆమె చెప్పారు 

వివేకానంద రెడ్డి వంటి ఉత్తముడిని తమ కుమారుడు చంపినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. గత రెండున్నర ఏళ్లు వాచ్ మన్ రంగయ్య ఎందుకు నోరు విప్పలేదని ఆమె అడిగారు. తన కుమారుడు అమాయకుడని చెప్పింది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వాచ్ మన్ రంగయ్య మెజిస్ట్రేట్ వద్ద ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ యాదవ్ పేరు చెప్పిన విషయం తెలిసిందే. హత్య చేసేందుకు డబ్బులను పంచిపెట్టింది సునీల్ యాదవ్ అని రంగయ్య చెప్పాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సునీల్ యాదవ్ ను గోవాలో సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకుని కడపకు తీసుకుని వచ్చారు.

click me!