
గుంటూరు: YSRCP Plenary ప్లీనరీ జరిగే ప్రాంగణానికి ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు YS Vijayamma, సీఎం జగన్ లు ఒకే వాహనంలో వచ్చారు. శుక్రవారం నాడు ఉదయం పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి ఈ ఇద్దరు వచ్చిన వెంటనే పార్టీ పతక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేశారు.
వైసీపీ ప్లీనరీ ప్రారంభానికి ముందుగా సీఎం వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తాడేపల్లి నుండి ఒకే వాహనంలో సీఎం జగన్, ఆయన తల్లి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వచ్చారు. పార్టీ ప్లీనరీ ప్రాంగణానికి వచ్చిన విజయమ్మకు, జగన్ కు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఇవాళ ఉదయం కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. అక్కడి నుండి నేరుగా విజయమ్మ, వైఎస్ జగన్ లు తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ జరిగే ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం జగన్ వాహనంలోనే విజయమ్మ కూడా వచ్చారు. కారు దిగిన విజయమ్మకు నేతలు ఆహ్వానం పలికారు.
వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్లీనరీలో శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ఎన్నుకొనేందుకు వీలుగా పార్టీ నియమావళిలో మార్పులు చేర్పులు చేస్తారనే ప్రచారం సాగుుంది. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి వైఎస్ విజయమ్మను తప్పిస్తారని కూడా ప్రచారం సాగుతుంది.అయితే ఈ విషయమై వైసీపీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సమయంలోనే ఒకే వాహనంలో విజయమ్మ, వైఎస్ జగన్ కలిసి వచ్చారు.
రెండు రోజుల పాటు ఈ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. కీలకమైన ఐదు తీర్మానాలు చేయనున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు.