
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం(ఏప్రిల్ 19) రోజున శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు (భావనపాడు పోర్టు) నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పోర్టు వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని.. శ్రీకాకుళం ఓడరేవు నగరంగా మారుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆకాంక్షించారు. విశాఖపట్నం పోర్టు తర్వాత ఈ పోర్టుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం జగన్ పర్యటన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు. అక్కడి నుంచి ఉదయం 9.20 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సంతబొమ్మాళి మండలం మూలపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు 10.15 గంటలకు చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి పోర్టు శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణకు బయల్దేరుతారు. అక్కడ పోర్టు శంకుస్థాపన, గంగమ్మ తల్లికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఉదయం 11 గంటలకు మళ్లీ హెలీకాప్టర్‌లో బయల్దేరి 11.10 గంటలకు నౌపడ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.25 గంటల నుంచి 11.35 వరకు నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు, హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుని సీఎం వైఎస్ జగన్ ప్రసంగం చేస్తారు.
ప్రసంగం అనంతరం మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తర్వాత 12.40 గంటలకు సభా వేదిక నుంచి బయల్దేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.10 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 2 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.