రాజధాని అమరావతి కోసం పోరు చేస్తున్న పవన్ కల్యాణ్, చంద్రబాబులకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిపై జరుగుతున్న ఆందోళనలను చల్లార్చడానికి జగన్ ఆ వ్యూహాన్ని ముందుకు తెచ్చినట్లు చెబుతున్నారు.
అమరావతి: రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త వ్యూహాన్ని ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు కూడా తెర దించేందుకు ఆయన నడుం బిగించినట్లు సమాచారం.
రాజధాని అమరావతిని నగర పాలక సంస్థగా ఏర్పాటు చేసే వ్యూహాన్ని వైఎస్ జగన్ అనుసరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధానిని తరలించడం లేదని, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పడానికి అనువైన వ్యూహంగా దాన్ని చెబుతున్నారు. పాలనా వికేంద్రీకరణ మాత్రమే జరుగుతుందని, రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చెప్పడానికి వీలైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
undefined
అమరావతి ప్రాంతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదు. వైఎస్ జగన్ వ్యూహంలో భాగంగానే వాటిని ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. అమరావతిని నగర పాలక సంస్థగా చేయడానికి గుంటూరు జిల్లాలోని 75 ఎంపీటీసిలను, వాటి పరిధిలోని గ్రామ పంచాయతీలను రద్దు చేయాల్సి ఉంటుంది. వీటి పరిధిలోని దాదాపు 2 లక్షల మంది గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్లుగా మారుతారు.
ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు ఆయా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లోని వార్డులుగా కొనసాగుతాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే ఆ మేరకు ఉత్తర్వులు పంపినట్లు తెలుస్తోంది. వాటితో పాటు ప్రస్తుతం రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతిని ప్రత్యేక నగర పాలక సంస్థగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
తుళ్లూరు మండలంలోని 18 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామ పంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాలు, తాడేపల్లి మండలంలోని రెండు రెవెన్యూ, పంచాయతీ గ్రామాలు, మంగళగిరి మండలంలోని ఏడు గ్రామపంచాయతీలు, 4 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 9 గ్రామాలను కలిపి రాజధాని అమరావతి నగరం పేరుతో మున్సిపల్ కార్పోరేషన్ గా చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. గురజాల, దాచేపల్లి మండల కేంద్రాలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందుతున్నట్లు తెలుస్తోంది.