వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులేనని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అధికారాన్ని తాను బాధ్యతగా భావించినట్టుగా చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ తన కుటుంబ సభ్యులేనని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అధికారాన్ని తాను బాధ్యతగా భావించినట్టుగా చెప్పారు. అందుకే ప్రజలకు తొలి సేవకుడిగా బాధ్యతగా వ్యవహరించానని చెప్పారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 52 నెలల కాలంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విప్లవవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకు సామాజిక న్యాయం పాటించామని చెప్పారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని తెలిపారు.
మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల ప్రకటనను చేశామని చెప్పారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. నాలుగేళ్ల పాలనలో జగన్ చెప్పాడంటే చేస్తాడనే మంచి పేరును తెచ్చుకోవడం జరిగిందని తెలిపారు.
undefined
రూ. 2 లక్లల 35 వేల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా లబ్దిదారులకు నేరుగా అందించామని చెప్పారు. నాలుగేళ్లలో 2 లక్షల 7 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇచ్చామని చెప్పారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. 22 లక్షల ఇళ్లు అక్కాచెల్లమ్మల పేరుతో కడుతున్నామని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.
వైసీపీ తప్ప ప్రజలకు ఇచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదని చెప్పారు. నాలుగేళ్లలో పరిపాలనలో, వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకొచ్చిన దేశ చరిత్రలో మరెక్కడా లేదని సగర్వంగా తెలియజేస్తున్నానని తెలిపారు. పేదవాడి గురించి ఆలోచించి.. వారి గురించి నిలబడిన ప్రభుత్వం తమదని చెప్పారు.
మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని.. రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి తన ఆలోచనలను మీతో పంచుకుంటున్నానని చెప్పారు. వీటిని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని, మీటింగ్‌లు పెట్టి చెప్పాలని వైసీపీ ప్రతినిధులను కోరారు.