తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఏపీ బీజేపీ నాయకులపై కూడా పలు ఆరోపణలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఏపీ బీజేపీ నాయకులపై కూడా పలు ఆరోపణలు చేశారు. విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజల్లో ఉన్న జైలులో ఉన్న పెద్ద తేడా ఏం ఉండదని విమర్శించారు. చంద్రబాబుకు క్రెడిబులిటీ లేదని.. అందుకే ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటేనని అన్నారు.
పేదవాళ్లు, ప్రజలకు.. చంద్రబాబును, టీడీపీని చూసినప్పుడు మోసాలు, వెన్నుపోటులు, అబద్దాలు, వంచనలు గుర్తుకు వస్తాయని జగన్ అన్నారు. అదే వైసీపీని, జగన్‌ను చూసినప్పుడు.. సామాజిక న్యాయం, మారిన స్కూళ్లు, వ్యవసాయం, వ్యవస్థ గుర్తుకు వస్తాయని చెప్పారు. చంద్రబాబును కక్ష సాధింపుతో ఎవరూ అరెస్ట్ చేయలేదని అన్నారు. చంద్రబాబు మీద తనకు ఎలాంటి కక్ష లేదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ కూడా తాను లండన్‌లో ఉన్నప్పుడు జరిగిందని అన్నారు.
‘‘చంద్రబాబు మీద కక్ష సాధింపు నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీలో టీడీపీ మనుషులే ఉన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు.. చంద్రబాబు మీద విచారణ జరిపి ఆయన అవినీతిని నిరూపించాయి. ఈడీ అయితే దోషులను కూడా అరెస్ట్ చేసింది. బాబుకు ఇన్‌కమ్ ట్యాక్స్ అదికారులు నోటీసులు కూడా ఇచ్చారు. చంద్రబాబు మీద మోదీ అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఆనాటికే మోదీకి, కేంద్రానికి అన్ని తెలుసు కాబట్టే.. సీబీఐ, ఈడీ, ఐటీలను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్‌ను కూడా విత్ డ్రా చేశాడు. ఆనాటికే చంద్రబాబు అవినీతిపరుడని స్పష్టం అయింది. అలాంటి వ్యక్తి మీద విచారణ చేయకూడదటా?, ఆధారాలు లభించిన అరెస్ట్ చేయకూడదటా?, కోర్టు ఆధారాలు చూసి రిమాండ్‌కు పంపిన కూడా.. చంద్రబాబును చట్టానికి పట్టివ్వకూడదని ఎల్లో మీడియా, గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి’’ అని జగన్ అన్నారు.
ఇలాంటి వ్యవస్థతో యుద్దం చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబును సమర్ధించడం అంటే.. ఈ రాష్ట్రంలోని పేద సామాజిక వర్గాలను అన్నింటినీ కూడా వ్యతిరేకించడమేనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబును సమర్ధించడం అంటే పెత్తందారు వ్యవస్థను, నయా జమీందారి వ్యవస్థను సమర్ధించడమేనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.
ప్రతిపక్షాలు అని పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని.. వాళ్లను చూస్తే తనకు ఆశ్చర్యమనిపిస్తుందని అన్నారు. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. వచ్చే రిజల్ట్ పెద్ద సున్నానే అని విమర్శించారు. ఒకరు పార్టీ పెట్టి 15 ఏళ్లు అయినా ఇవాల్టికి కూడా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి లేరని పవన్ కల్యాణ్‌పై జగన్ విమర్శలు గుప్పించారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండా మోయడానికి మనిషి లేడని.. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజానికి ఎత్తుకుని మోయడమేనని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన మోసాలు, దోచుకున్న వాటిలో ఆయన భాగస్వామి అని ఆరోపించారు. అందుకే ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలనేదే ఆలోచన చేస్తారని విమర్శలు గుప్పించారు.
ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వారికెవ్వరికీ లేదని జగన్ విమర్శలు గుప్పించారు. దోచుకుని వాటాలు పంచుకోవడమే వారి పని అని ఆరోపించారు. రాజకీయమంటే విశ్వసనీయత అని, విలువలు అని, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫొటో ఉండాలని ఆరాట పడటం అని, పేదవాడి చిరునవ్వు నవ్వినప్పుడు అందులో మనం గుర్తుకు రావడమని ఆరాటపడటం.. అని వారికి తెలియదని అన్నారు. చనిపోయిన తర్వాత ప్రతి గుండెలో కూడా బతకడం తమకు తెలిసిన రాజకీయమని అన్నారు. అందుకే తాను నమ్ముకున్నది ప్రజలను, దేవుడినని అన్నారు.