
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పార్టీ చరిత్ర అడుగడున వెన్నుపోట్లనే నిరూపిస్తుందని విమర్శించారు. చంద్రబాబు పార్టీ సిద్దాంతం వెన్నుపోటేనని అన్నారు. అప్పుడు పార్టీ పెట్టిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని.. ఎన్నికల కోసం ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అనేది పెత్తందార్ల పార్టీ అని ఆరోపించారు. పెత్తందార్ల ద్వారా, పెత్తందార్ల చేత, పెత్తందార్ల కోసం నడుస్తున్న పార్టీ టీడీపీ అని ఎద్దేవా చేశారు.
అదే సమయంలో చంద్రబాబు రింగ్‌పై కూడా జగన్ సెటైర్లు వేశారు. ‘‘ఈ మధ్య చంద్రబాబు రింగ్‌లో చిప్ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా చేతి రింగ్‌లోనో, మొకాళ్లల్లోనో, అరికాళ్లలోనే చిప్ ఉంటే సరిపోదు. మెదడు, గుండెలో చిప్పు ఉండాలని.. అప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో ఉంటుంది. ప్రజల కష్టాలను అర్ధం చేసుకునే చిప్ చంద్రబాబుకు లేదు’’ అని జగన్ చెప్పారు.
చంద్రబాబు, దుష్టచతుష్టయం వారి పిల్లలను, మనవళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారని.. కానీ పెద పిల్లకు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దని అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. అందుకే బైజూస్‌తో ఒప్పందం చేసుకన్నామని చెప్పారు. దానిని కూడా చంద్రబాబు ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా.. అన్ని అమలు చేస్తూనే ఉన్నాం. చంద్రబాబు మాదిరిగా ప్రతిపక్షంపై ఫోకస్ పెట్టలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాక్కోవాలని ఆలోచన చేయలేదు. మూడేళ్లుగా ఎటువంటి మంచి చేస్తాం, ఎలాంటి పాలన అందిస్తామనే దానిపై ఫోకస్ పెట్టాను. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ఆర్జీ పెట్టుకున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలని ఆర్జీ పెట్టుకున్నారు. కుప్పంకు రెవెన్యూ డివిజన్ ఇచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. కుప్పం ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ పని చేశాం’’ అని జగన్ చెప్పారు.