కుల చిచ్చు: చంద్రబాబుపై జగన్ ప్రయోగించిన అస్త్రం

By pratap reddyFirst Published Feb 5, 2019, 3:44 PM IST
Highlights

జగన్ చేసిన విమర్శను నేరుగా చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ నేతలు గానీ ఖండించడం లేదు. కానీ, జగన్ పై విమర్శలు మాత్రం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా జగన్ కులమనే అస్త్రాన్ని చంద్రబాబుపై ప్రయోగించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాలు ప్రధానమైన భూమిక పోషిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరు కాదన్నా, అవునన్నా రాష్ట్ర రాజకీయాల్లో కుల రాజకీయాలదే పైచేయి. ఏ పార్టీ నాయకులు కూడా బాహాటంగా చెప్పకపోయినా కుల సమీకరణాలను చూసుకునే అడుగు ముందుకు వేస్తారు. 

ఎవరు కూడా బాహాటంగా చేయని విమర్శను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై చేశారు. అది ఇప్పుడు రగులుకుంటోంది. తెలుగుదేశం పార్టీకి అది చిక్కు సమస్యగా మారింది.

జగన్ చేసిన విమర్శను నేరుగా చంద్రబాబు గానీ, తెలుగుదేశం పార్టీ నేతలు గానీ ఖండించడం లేదు. కానీ, జగన్ పై విమర్శలు మాత్రం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా జగన్ కులమనే అస్త్రాన్ని చంద్రబాబుపై ప్రయోగించారు. రాష్ట్రంలో దొంగ ఓట్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తిరుగులేని బాణం వేశారు. 

ఎపిలో కుల ప్రాతిపదికన పోలీసుల నియామకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికిచెందిన పోలీసులకు అధికారులకు ఒకే దెబ్బతో ప్రమోషన్లు ఇచ్చారని, ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే ఇది చేశారని ఆయన ఆరోపించారు. ఎపిలో మొత్తం 37 మంది సిఐలకు ప్రమోషన్ ఇస్తే అందులో 35 మంది చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని తాను ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

దాంతో తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడినట్లే ఉంది. అయితే, జగన్ చేసిన ఆరోపణలకు చంద్రబాబు సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. అలా చేయలేదని చెప్పడానికి తగిన ఆధారాలను కూడా చూపడం లేదు. చంద్రబాబుపై ఈ విధమైన విమర్శలు గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేసిన దాఖలాలు లేవు. తనను రెడ్డి సామాజిక వర్గానికి అంటగడుతూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ప్రతిగా అదే బాణాన్ని జగన్ తన అమ్ముల పొదిలోంచి తీసినట్లు కనిపిస్తున్నారు. 

చంద్రబాబు ప్రతి రోజూ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తుంటారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో వస్తుంటాయి. అదే విధంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు ప్రతిస్పందనలు మీడియాలో వచ్చాయి. తన ప్రభుత్వంలో, పార్టీలో అన్ని కులాలూ ఉన్నాయని, జగన్ ఒక్క కులానికి వంతపాడుతున్నారని, జగన్ కు కులపిచ్చి పట్టుకుందని చంద్రబాబు అన్నారు. కులాలకు, అధికారులకు సంబంధమేమిటని కూడా ఆయన ప్రశ్నించారు. 

తన ప్రభుత్వంలో ఏ కులానికి కూడా అన్యాయం జరగలేదని ఆయన చెప్పారు. హోం మంత్రి చినరాజప్ప కూడా జగన్ చేసిన విమర్శలకు సూటిగా సమాధానం ఇవ్వలేదు. పదోన్నతులు, బదిలీలు అనేవి సాధారణమైన విషయాలని, వాటిలో అర్హత తప్ప కులం జోక్యం ఉండదని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, తాజాగా చినరాజప్ప జగన్ కు సవాల్ విసిరారు. ఒకే కులానికి చెందినవారికి ప్రమోషన్లు ఇచ్చారనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని ఆయన జగన్ ను అడిగారు. ఈ సవాల్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు స్పందిస్తారా, స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిందే.

జగన్ మాత్రం అదును చూసి రాయి విసిరినట్లే కనిపిస్తున్నారు. అది  టీడీపికి తగులుతుందా, జగన్ కు ఎదురు తిరుగుతుందా అనేది వేచి చూడాలి. 

click me!