Chandrababu: ఎన్నిక‌ల ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబుపై అధికార పార్టీ కుట్ర‌.. : టీడీపీ

By Mahesh RajamoniFirst Published Sep 25, 2023, 10:49 AM IST
Highlights

Anantapur: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నుంచి క్లీన్ చిట్ తో బ‌య‌ట‌ప‌డ‌తార‌ని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి  అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కుట్ర పన్ని ఎన్నికల ముందు అరెస్టు చేసిందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు.
 

Chandrababu Naidu arrest: తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, హిందూపురం, ఉరవకొండ, కదిరి, ధర్మవరం, రాప్తాడు, శింగనమల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రదర్శనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసులును హౌస్ అరెస్ట్ చేసి ఇంటికే పరిమితం చేశారు.

రాయదుర్గంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల అధ్యక్షులు శ్రీనివాసులు, బీకే పార్థసారధి విలేకరులతో మాట్లాడుతూ క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి రూ.43 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డికి చంద్రబాబును అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసే నైతిక హక్కు లేదన్నారు. కావాల‌నే చంద్ర‌బాబుపై కుట్ర ప‌న్నుతున్నార‌ని విమ‌ర్శించారు.

అలాగే, చంద్రబాబు నాయుడు పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల నుంచి క్లీన్ చిట్ తో బ‌య‌ట‌ప‌డ‌తార‌ని ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి  అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కుట్ర పన్ని ఎన్నికల ముందు అరెస్టు చేసిందని ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. చంద్ర‌బాబు చేసిన అభివృద్ది ప‌నుల‌తో అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందనీ, అందుకే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఆయన అరెస్టుపై నిరసనలు తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు.

ఇదిలావుండ‌గా, చంద్రబాబు నాయుడు రిమాండ్ ను ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. ఏపీ  స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.  రిమాండ్, కస్టడీని పొడిగించాలని సీఐడీ కోరింది. విచార‌ణ త‌ర్వాత కోర్టు చంద్రబాబు  జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామనీ, ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబుకు తెలిపారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు పెండింగ్ లో ఉందని న్యాయమూర్తి ఆయనకు వివరించారు.

నాయుడును జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని జైలు అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నేర దర్యాప్తు విభాగం దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కోర్టు విచారించే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్ లో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై చంద్రబాబును ప్రశ్నించినట్లు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

click me!