మంత్రివర్గం కూర్పుపై గుబులు: కీలక శాఖలన్నీ జగన్ వద్దే...

By Nagaraju penumalaFirst Published Jun 6, 2019, 12:32 PM IST
Highlights

సీఎం వైయస్ జగన్ మంత్రి వర్గంలో కొన్ని శాఖలకు కోతలు విధించనున్నారని తెలుస్తోంది. కొన్ని శాఖలను తన వద్దే ఉంచుకోవాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీలక శాఖలైన భారీ నీటిపారుదల, విద్య, వైద్య, ఆరోగ్యశాఖలను తానే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కేబినెట్ పై సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులపై పెద్ద ఎత్తున ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. 

జగన్ తన కేబినెట్ లో ఎంతమందికి అవకాశం ఇస్తారు 13 మందికా లేక 25 మందికా అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణపై సీఎం వైయస్ జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు. కానీ ఎవరెవరికి బెర్త్ లు కన్ఫమ్ చేశారనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. 
 
తొలుత జగన్ తన కేబినెట్ లో 13 మందికి మాత్రమే అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నిరాశ నెలకొంది. బొత్తిగా 13 మంది అంటే తమ పరిస్థితి ఏంటని ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 

పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున మంత్రి వర్గంలో జగన్ అవకాశం కల్పిస్తారని వార్తలు రావడంతో ఆశావాహుల్లో ఆనందం నెలకొంది. పార్టీలో సినీయర్ కాబట్టి తనకే వర్తిస్తుందని ఒకరు, జగన్ కు విధేయుడినని మరికొందరు ఎవరికి వారు తమ క్వాలిఫికేషన్లు చెప్పుకుండా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు.

అయితే సీఎం వైయస్ జగన్ మంత్రి వర్గంలో కొన్ని శాఖలకు కోతలు విధించనున్నారని తెలుస్తోంది. కొన్ని శాఖలను తన వద్దే ఉంచుకోవాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కీలక శాఖలైన భారీ నీటిపారుదల, విద్య, వైద్య, ఆరోగ్యశాఖలను తానే స్వయంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ శాఖలపై పలుమార్లు రివ్యూ నిర్వహించిన జగన్ నీటి పారుదల శాఖ, విద్య,వైద్యఆరోగ్య శాఖలలో లోప భూయిష్ట నిర్ణయాలు ఉన్నాయని గమనించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే భారీ నీటి పారుదల విషయంలో జగన్ చాలా క్లియర్ గా ఉన్నారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. టెండర్ల విషయంలో రివర్స్ ప్రోసెసింగ్ దగ్గర నుంచి తానే స్వయంగా పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన కీలక ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగన్ ధృడ సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే నీటి పారుదల శాఖకు సంబంధించి పలు ప్రాజెక్టుల పనులను నిలిపివేశారు వైయస్ జగన్. ఎన్నికల ముందు పనులు చేపట్టిన పనులను నిధుల లేమి కారణంగా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే పోలవరం ప్రాజెక్టుపై కూడా వైయస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం తన కల అని చెప్పుకొచ్చిన వైయస్ జగన్ ఎప్పటిలోగా పూర్తి చేసే అంశంపై అధికారుల దగ్గర క్లారిటీ తీసుకున్నారు. 

అలాగే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల నేపథ్యంలోఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు సైతం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుకే జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా  ఆదిత్యనాథ్ దాస్ ను నియమించిడం వెనుక ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తోంది. 

మరోవైపు ప్రాజెక్టుల టెండర్ల విషయంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను కలిసిన వైయస్ జగన్ జ్యుడీషియల్ కమిషన్ పై చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కీలక శాఖ అయిన నీటి పారుదల శాఖను తన వద్దే ఉంచుకుని స్వయంగా పర్యవేక్షించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. 

మరోవైపు కీలకమైన విద్య వైద్యఆరోగ్య శాఖను సైతం తన వద్దే ఉంచుకోవాలని వైయస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వైద్యఆరోగ్య శాఖ రివ్యూ సమావేశంలో మెడ్ టెక్ జోన్ వంటి కీలక ప్రాజెక్టులపై జగన్ ఆరా తీశారు. ఇకపై వైద్య ఆరోగ్య శాఖను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని కూడా అధికారులకు స్పష్టం చేశారు. 

వైద్యఆరోగ్యశాఖ రివ్యూలో కీలక అంశాలపై ఆరా తీసిన వైయస్ జగన్ ఆ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యను వ్యవసాయశాఖకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖను సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన కేఎస్ జవహర్ రెడ్డికి అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డిని జగన్ నియమించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తానని వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ హామీల నేపథ్యంలో ఇప్పటికే వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు కోసం తెలంగాణ, పుదుచ్చేరి ప్రభుత్వాలతో చర్చించినట్లు తెలుస్తోంది. 

మరోకీలకమైన శాఖ విద్య. వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది విద్యాశాఖను బలోపేతం చేయాలని. అమ్మఒడి వంటి కీలక పథకాలను వైయస్ జగన్ తీసుకువచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ శాఖను కూడా జగన్ తానే స్వయంగా పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. 

ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం భారీ నీటిపారుదల శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో ఆయన మేనల్లుడు టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఆశాఖకు మంత్రిగా పనిచేశారు. 

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ శాఖను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఏపీలో కూడా వైయస్ జగన్ భారీ నీటిపారుదల శాఖను స్వయంగా పర్యవేక్షిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం వాస్తవమా కాదా అనేది తెలియాలంటే మరో రెండురోజులపాటు వేచి చూడాల్సిందే. 

click me!