సాధ్యమైనంత త్వరగా నన్ను దింపేయాలని...: ఈనాడు డైలీపై ధ్వజమెత్తిన జగన్

By telugu teamFirst Published Sep 20, 2021, 12:03 PM IST
Highlights

ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా ధ్వమెత్తారు. ఈనాడు వార్తాకథనాన్ని చదివి వినిపిస్తూ ఇంత అన్యాయమైన పత్రిక ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు.

హైదరాబాద్: కొన్ని మీడియా సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై, టీవీ5 టీవీ చానెల్ మీద ఆయన విమర్శలు చేశారు. సాధ్యమైనంత త్వరగా తనను దింపేసి, వారికి నచ్చిన చంద్రబాబు ఎక్కించాలని ఆ మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్సించారు. 

ప్రతిపక్షం టీడీపీతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. అబద్ధాలను నిజాలు చేయడానికి వక్రభాష్యాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. వారికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి సాధ్యమైనంత త్వరగా గద్దె దింపి, తమ వ్యక్తిని గద్దె ఎక్కించాలని చంద్రబాబును భుజాన వేసుకున్నాయని ఆయన అన్నారు. 

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిని అంగీకరించలేని స్థితిలో ఈనాడు దినపత్రిక ఉందని ఆయన అన్నారు. అలా అంటూ ఆయన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఈనాడులో వచ్చిన వార్తాకథనంలోని కొంత భాగాన్ని ఆయన చదివి వినిపించారు. ఇటువంటి అన్యాయమైన పత్రిక ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఆయన అన్నారు. పార్టీ గుర్తు మీదే జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికలు జరిగాయని ఆయన చెప్పారు. తమ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తే జీర్ణించుకోలేక వక్రభాష్యాలు చెబుతోందని ఆయన ఈనాడుపై విరుచుకుపడ్డారు. 

ప్రజలకు మంచి చేస్తే అది జరగకూడదని మీడియా, ప్రతిపక్షంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని, తమ ప్రభుత్వ కార్యక్రమాలను తప్పుడు వార్తాకథనాల ద్వారా, కోర్టు కేసుల ద్వారా అడ్డుకోవడానికి చూస్తున్నాయని ఆయన విమర్శించారు. 

ఓ వైపు కోవిడ్ సమస్యను ఎదుర్కుంటూనే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపడుతున్నామని, దాంతో దేవుని దయవల్ల ప్రజల దీవెనలతో తమ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తోందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ గెలిచిన సీట్ల సంఖ్య, విజయాల శాతాలను ఆయన వివరించారు. తమను ఆశీర్విదించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు తాము రుణపడి ఉంటామని ఆయన చెప్పారు.

click me!