వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. సజ్జల తనయుడికి కీలక బాధ్యతలు..!

By Sumanth KanukulaFirst Published Sep 13, 2022, 2:09 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారం చెపట్టేలా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారం చెపట్టేలా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సీఎం జగన్.. వైసీపీ సోషల్ మీడియా విభాగం పటిష్టత‌పై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో సోషల్ మీడియాను వైసీపీ బాగా వాడుకుందనే ప్రచారం ఉంది. అయితే గత కొంతకాలంగా టీడీపీ, జనసేనలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలకు కౌంటర్ స్ట్రాటజీ అవసరమని జగన్ భావిస్తున్నారు. 

ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా విభాగం బాగానే ఉందని.. ప్రతిపక్షాలకు గట్టిగానే కౌంటర్ ఇస్తుందనే టాక్ ఉంది. అయితే జగన్ మాత్రం రానున్న ఎన్నికలను ఎదుర్కొవడానికి పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత స్ట్రాంగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలను.. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవరెడ్డికి అప్పగించినట్టుగా తెలుస్తోంది. 

తాజాగా వైసీపీ ముఖ్యనేతలతో పాటు.. భార్గవరెడ్డి, సోషల్ మీడియా వింగ్ నేతలు, ఐప్యాక్ ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది.  ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికపుడు ప్రజలలో వెళ్లేలా..  ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా ధీటుగా తిప్పికొట్టాలని ఈ సందర్భంగా జగన్ సూచించినట్టుగా సమాచారం. అలాగే వైసీపీని మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లేలా కంటెంట్‌ను రూపొందించి.. సోషల్ మీడియా వేదికగా ప్రచారంలో ఉంచాలని కూడా చెప్పినట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియా వింగ్‌ను పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చూసిన సంగతి తెలిసిందే. 

click me!