
పేదల తలరాత మారాలి అంటే చదవు అనే ఆస్తి ఉండాలని ఆంధ్రప్రేదశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి విద్యార్థి బాగా చదువుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవానికి శ్రీకారానికి చుట్టామని తెలిపారు. సీఎం జగన్ బుధవారం(డిసెంబర్ 21) బాపట్ల జిల్లా యడ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మొత్తం 5,18,740 ట్యాబ్‌లను పంపిణీ చేస్తోంది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశానని అన్నారు. పేదల బతుకులు మారాలంటే తలరాతలు మారాలని చెప్పారు. తలరాతలు మారాలంటే చదవు ఒక్కటే మార్గం అని అన్నారు. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. సమాజంలో అంతరాలు తొలగాలని చెప్పారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూస్తే బాధ వేస్తుందని తెలిపారు. అందుకే తాము అధికారంలోకి వచ్చాక అంతరాలు తొలగించే చర్యలు తీసుకున్నామని తెలిపారు. పెత్తందారీలు వాళ్ల పిల్లలను, మనవళ్లను, మనవరాళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు.. కానీ పేద పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చర్యలు చేపడితే.. కోర్టులకు వెళతారని అన్నారు.
విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలని అన్నారు. మంచి విద్యా విధానంతో పిల్లల తలరాతలు మారుతాయని చెప్పారు. భావితరాల పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నేదే తమ లక్ష్యమని తెలిపారు. చదువులో సమానత్వం ఉంటేనే ప్రతి కుటుంబం అభివృద్ది చెందుతుందన్నారు. రూ. 686 కోట్ల విలువైన 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 26 జిల్లాల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ జరుగుతందన్నారు. వారం రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఏడాది కూడా 8వ తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేయనున్నట్టుగా చెప్పారు. ఈ ట్యాబ్ వల్ల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
ఇంటర్‌నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చదువుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నట్టుగా జగన్ చెప్పారు. ట్యాబ్‌లో పాఠాలు సులవుగా అర్థమయ్యేలా బైజూస్ కంటెంట్ వేసి ఇస్తున్నట్టుగా తెలిపారు. ప్రతి ట్యాబ్‌కు మూడేళ్ల వారంటీ.. ఎలాంటి రిపేర్ అయినా ఉచిత సర్వీసు అందిస్తున్నట్టుగా చెప్పారు. ట్యాబ్‌ల వల్ల పిల్లలకు చెడు జరగకూడదనే ఉద్దేశంతో.. అందులో పిల్లలకు నష్టం జరిగే కంటెంట్ లేకుండా చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. నాడు-నేడు మొదటి దశ పూర్తిచేసుకున్న పాఠశాలల్లో వచ్చే ఏడాది జూన్ నాటికి డిజిటల్ క్లాస్ రూమ్‌లు అందుబాటులోకి తీసుకోస్తున్నట్టుగా తెలిపారు.