వీడని కరోనా భయం.. కాకినాడలో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్లు.. చివరకు..

Published : Dec 21, 2022, 09:14 AM IST
వీడని కరోనా భయం.. కాకినాడలో మూడేళ్లుగా ఇంటికే పరిమితమైన తల్లీకూతుళ్లు.. చివరకు..

సారాంశం

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు మానసిక అసమతుల్యతతో బాధపడుతున్న ఓ తల్లీకూతుళ్లు మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో చోటుచేసుకుంది. 

ఓ వైపు కరోనా భయం.. మరోవైపు మానసిక అసమతుల్యతతో బాధపడుతున్న ఓ తల్లీకూతుళ్లు మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. అందులో తల్లి అనారోగ్యం  బారినపడటంతో విషయం తెలుసుకున్న ఆరోగ్య బ్బంది.. పోలీసులు, స్థానికుల సహకారంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామంలో చోటుచేసుకుంది.  వివరాలు.. కుయ్యేరు గ్రామ పంచాయితీ  సమీపంలో కర్నీడి సూరిబాబు, అతని భార్య మణి, కూతురు దుర్గాభవానిల‌తో కలిసి నివాసం ఉంటున్నాడు. సూరిబాబు ఇంటింటికి తిరిగి కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. 

అయితే కరోనా లాక్‌డౌన్ సమయం నుంచి మణి, దుర్గాభవానిలు ఇంటికే పరిమితమయ్యారు. మూడేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయారు. బంధువు, చుట్టుపక్కల వాళ్లు పిలిచినప్పటికీ.. చేతబడి చేయడానికి వచ్చారా? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసేవారు. ఈ క్రమంలోనే బంధువు, చుట్టుపక్కల వాళ్లు వారిని పలకరించడం మానేశారు. మరోవైపు సూరిబాబు మాత్రం బయట తన పనులు చేసుకుంటూ వారికి అవసరమైన ఆహారం, వస్తువులు తీసుకొచ్చి ఇస్తుండేవాడు. 

అయితే ఇటీవల మణి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో సూరిబాబును ఆమెను డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో.. సూరిబాబు స్థానిక పీహెచ్‌సీకి సమాచారం అందించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆరోగ్య సిబ్బంది.. సూరిబాబు ఇంటికి వెళ్లారు. వారుంటున్న గదిలో భారీగా దుర్వాసనతో నిండిపోయినప్పటికీ.. వారిద్దరు ఏమాత్రం పట్టింపు లేకుండా అక్కడే ఉండటాన్ని వైద్య సిబ్బంది గమనించారు. అయితే తల్లీకూతుళ్లు మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో వారు స్థానికులు, గ్రామ సర్పంచ్ సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి  వెళ్లారు. 

అయినప్పటికీ వారు చికిత్సకు నిరాకరించడంతో చివరకు గొల్లపాలెం పోలీసుల సహకారంతో మహిళలిద్దరినీ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం  వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వీరిని రెండు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత తెలిపారు. అయితే చేతబడి చేసి తమను చంపేందుకు ఎవరో కుట్ర పన్నారని దుర్గాభవాని పోలీసులకు చెప్పింది.

సూరిబాబు మాట్లాడుతూ.. తన భార్య, కూతురు మానసిక స్థితి బాగోలేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ఇద్దరూ చాలా అరుదుగా తమ ఇంటి నుండి బయటకు వెళ్లేవారని చెప్పారు. గత మూడేళ్లుగా ఇంట్లో వారికి భోజనం వడ్డించేవాడినని తెలిపారు. అయితే నాలుగు నెలల క్రితం తనను ఇంటి నుంచి బయటకు వెళ్లమని ఒత్తిడి  చేశారని తెలిపారు. దీంతో తాను వేరే ఇంట్లో ఉంటూ.. ఆహారం సిద్ధం చేసి, వారి ఉంటున్న గది  కిటికీ వద్ద ఉంచేవాడినని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే