ఎన్టీఆర్ బయోపిక్ పై వైఎస్ జగన్ కామెంట్స్ ఇలా...

First Published Jul 21, 2018, 4:22 PM IST
Highlights

దివంగత నేత ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎన్టీఆర్ బ‌యోపిక్’పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తొలిసారి స్పందించారు. 

కాకినాడ: దివంగత నేత ఎన్టీ రామారావు జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎన్టీఆర్ బ‌యోపిక్’పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తొలిసారి స్పందించారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ అనే బాల‌కృష్ణ సినిమా షూటింగ్ సెట్స్‌లో ఉపరాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు క‌నిపిస్తారని, ఒక‌వైపు బీజేపీతో సీఎం చంద్రబాబు యుద్ధ‌మంటారని ఆయన అన్నారు. 

నిజంగా చంద్రబాబు యుద్ధం చేస్తున్నారా అని సామాన్యుడికి కూడా అనుమానం వ‌స్తుందని ఆయన అన్నారు. మ‌హారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య‌ను టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించారని ఆయన గుర్తు చేశారు.
 
ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఇక్క‌డ చంద్ర‌బాబు కొలువులో ఉంటారని, పరకాల భార్య నిర్మల సీతారామ‌న్ కేంద్రంలో మోడీకి మ‌ద్ద‌తు ఇస్తూ గట్టిగా మాట్లాడారని ఆయన అన్నారు. రాజ్‌నాథ్‌సింగ్ లోకసభలో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు మాకు మంచి మిత్రుడు.. ఈ బంధం ఎప్ప‌టికీ వీడుపోదు అన్నారని జగన్ గుర్తు చేశారు. 

అది యుద్ధం కాదని, లోపాయికారిగా వేరేవి జ‌రుగుతున్నాయని, ఎన్నిక‌ల త‌రువాత నాలుగేళ్లు బీజేపీతో క‌లిసి చంద్ర‌బాబు సంసారం చేస్తాడని జగన్ అన్నారు. ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందు విడాకులు తీసుకొని డ్రామాలాడుతున్నారని జగన్ అన్నారు. చంద్రబాబు చేసే యుద్ధంలో నిజాయితీ లేదని అన్నారు.

click me!