అనంతపురం జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన యువకుడు

By telugu teamFirst Published Jul 25, 2020, 11:24 AM IST
Highlights

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరదలు ముంచుకొస్తున్నాయి. గుత్తి మండలంలోని రాజాపురం గ్రామంలో ఓ యువకుడు వరదల్లో కొట్టుకుపోయాడు. ఆతని కోసం గాలిస్తున్నారు.

అనంతపుర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వరదలు ముంచుకొస్తున్నాయి. జిల్లాలోని గుత్తి మండలం రాజాపురం 63వ జాతీయ రహదారిపై వరదల్లో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. స్థానికులు అతన్ని రక్షించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ఫలించలేదు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

ఇదిలావుంటే, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు వాగులూ వంకలు పొంగిపొర్లుతున్నాయి. నేడు, రేపు ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో పలు చోట్ల పంటలు నీట మునిగాయి.

తెలంగాణలోని గద్వాల జిల్లా ఉండవల్లి వద్ద కొలుగట్ల వాగులో ఓ మహిళ కొట్టుకుపోయింది. వరద ఉధృతి విపరీతంగా ఉండడంతో ఆమె కారులోంచి దిగింది. అయితే కారుతో పాటు ఆమె కూడా కొట్టుకుపోయింది. కర్నూలు నుంచి హైదరాబాదు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుకల మహిళ కోసం గాలిస్తున్నారు.

ఆలంపూర్ చౌరస్తా నుంచి రాయపూర్ రోడ్డు వరకు రాకపోకలు స్తంభించాయి. బొంకూరు వద్ద కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదోనీ, పత్తికొండల మధ్య వరద ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. ఆలూరు నియోజకవర్గంలో పత్తి, ఇతర పంటలు నీట మునిగిపోయాయి.

పులివెందులకు చెందిన శివకుమార్ రెడ్డి, అతని భార్య సింధూ రెడ్డి, అతని స్నేహితుడు జిలాని బాషా కారులో ప్రయాణిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒడ్డుకు చేరుకోగా, సింధూ రెడ్డి మాత్రం వాగులో గల్లంతయ్యారు. బెంగుళూరు నుంచి కర్నూలు మీదుగా వారు హైదరాబాదు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

click me!