సినీ ఫక్కీలో యువకుడి కిడ్నాప్.. ప్రేమే కారణం

Published : Sep 22, 2018, 09:46 AM IST
సినీ ఫక్కీలో యువకుడి కిడ్నాప్.. ప్రేమే కారణం

సారాంశం

సినిమా రేంజ్ లో యువకుడిని, అతని ఫ్రెండ్ ని కిడ్నాప్  చేసుకొని వెళ్లిపోయారు

యువతీ యువకులు ప్రేమించుకోవడం.. అది నచ్చని పెద్దలు వారిపై దాడులు చేస్తున్న సంఘటలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా మిర్యాలగూడ, హైదరాబాద్ ఘటనలే అందుకు నిదర్శనం. కాగా.. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తెను ప్రేమించాడనే కారణంతో ఓ యువకుడిని యువతి తండ్రి సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశాడు. ఈ సంఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..చుట్టుగుంటకు చెందిన ఓ యువకుడు(18), ప్రసాదంపాడుకు చెందిన యువతి(17) గతంలో ఒకే పాఠశాలలో చదువుకుంటూ ప్రేమించకున్నారు. ప్రస్తుతం యువకుడు పాలిటెక్నిక్‌, యువతి ఇంటర్మీడియట్‌ చదువుతున్నారు.  వీరిద్దరి వ్యవహారం ఇరు కుటుంబాలకు ఇటీవల తెలియడంతో తెలిసితెలియని వయస్సులో ప్రేమ వ్యవహారాలు మాని సక్రమంగా చదువుకోవాలని హితవు పలికారు. కొద్దిరోజుల కిందట యువకుడి తండ్రి కుమారుడి  ఫోన్ లోని సిమ్‌లు తీసేశారు. 

యువకుడి నుంచి ఫోన్‌ రాకపోవడంతో యువతి మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో ఈనెల 16న యువతి తన తల్లితో కలిసి గుణదలలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ క్రమంలో తల్లి కన్నుగప్పి కుమార్తె వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తల్లి తన భర్తకు చెప్పడంతో అతడు యువకుడి తండ్రికి  ఫోన్‌చేసి  మీ కుమారుడే తీసుకువెళ్లాడని ఆరోపిస్తూ దూషించాడు. 

ఎలాగైనా మీకుమార్తెను మీకు అప్పగిస్తామని చెప్పి యువకుని తండ్రి హామీనిచ్చాడు. అనంతరం కుమారుడి ఫోన్ లో సిమ్‌ వేసిన కొద్దిసేపటికి యువతి నుంచి ఫోన్‌రాగా ఎక్కడున్నావని అడగ్గా తాను దుర్గగుడి వద్ద ఉన్నట్లుగా బదులిచ్చింది. వెంటనే కుమారుడితో కలసి అతను అక్కడకు వెళ్లారు. యువతితో మాట్లాడి నచ్చజెప్పి అదే విషయాన్ని ఆమె తండ్రికి ఫోన్‌ ద్వారా చెప్పి రాజీవ్‌గాంధీపార్క్‌ వద్దకు వచ్చి  తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కొద్దిసేపటికి యువతి తల్లిదండ్రులు, మరికొందరు పార్క్‌ వద్దకు వచ్చి యువకుడి తండ్రితో ఘర్షణకు దిగారు. 

యువకుడితో పాటు అతడి స్నేహితుడిపై చేయిచేసుకున్నారు. గొడవను గమనించిన సమీపంలోని వారు అక్కడకు చేరుకునే సరికి బలవంతంగా యువకులిద్దరినీ కారులోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. దీంతో యువకుడి తండ్రి 100కు కాల్‌చేసి సమాచారం అందించాడు. కారు నేతాజీవంతెన సమీపానికి చేరుకునే సరికి కృష్ణలంక పోలీసులు అప్రమత్తమై అందులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. 

వివరాలు సేకరించి కిడ్నాప్‌నకు పాల్పడినట్లుగా నిర్ధరించి యువతి తల్లిదండ్రులతో సహా మొత్తం 9మందిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, మిగిలిన 8మందిని ఈనెల 17న రిమాండ్‌కు తరలించారు. ప్రేమికులిద్దరూ మైనర్లు కావడంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచామని పోలీసులు పేర్కొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Inspirational Speech About Dr BR Ambedkar and Abdul Kalaam | Asianet Telugu
తిరుమల మెట్లెక్కిన 116ఏళ్ల బామ్మకి VIP బ్రేక్ దర్శనం | Asianet News Telugu