ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఢిల్లీకి రఘురామ కృష్ణం రాజు

By telugu teamFirst Published May 26, 2021, 12:15 PM IST
Highlights

సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బుధవారంనాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన హైదరాబాదులోని తన నివాసానికి వెళ్తారని భావించారు అయితే, ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

రఘురామ కృష్ణంరాజు 9 రోజుల పాటు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఐదు రోజుల పాటు కూడా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. తన కాలి పాదాలకు గాయాలు అయ్యాయని, వాటికి చికిత్స చేయాలని, ఆ ఖర్చులు తాను భరిస్తానని రఘురామ కృష్ణమ రాజు ఇటీవల ఆర్మీ ఆస్పత్రి కమాండ్ కు లేఖ రాశారు. 

Also Read: వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్

దాంతో ఆయన ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొంది బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. ఆయన ఇటీవల తన జన్మదినం రోజు హైదరాబాదులోని తన నివాసానికి వచ్చారు. ఆ రోజు కుటుంబ సభ్యులతో భోజనం చేసిన తర్వాత ఏపీ సిఐడి అధికారులు ఇంటికి చేరుకుని ఆయనను ఆరెస్టు చేశారు. 

తన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆయన తన ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీ నుంచే ఆయన వైసీపీపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీ సిఐడి ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసింది. 

తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రఘురామృష్ణమ రాజు హైకోర్టుకు వెళ్లారు. అయితే, బెయిల్ కోసం కింది కోర్టులో పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు ఆయనకు సూచించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు రఘురామ కృష్ణం రాజుకు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి తెలంగాణ హైకోర్టు ద్వారా సీల్డ్ కవర్ లో రఘురామ కృష్ణమ రాజు వైద్య పరీక్షల నివేదిక సుప్రీంకోర్టుకు అందింది.

ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు రఘురామ కృష్ణం రాజుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ మేరకు ఆయన బెయిల్ మీద విడుదలై ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన హైదరాబాదులోని ఇంటికి వెళ్లకుండా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. 

click me!