ప్రత్యేక హోదా: జంతర్ మంతర్ వద్ద వైసిపి దీక్ష

By Nagaraju TFirst Published Dec 27, 2018, 10:48 AM IST
Highlights

ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలులో నిర్లక్ష్యంపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను నిలదీసేందుకు వైసీపీ రెడీ అయ్యింది. హస్తిన వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది. 
 

ఢిల్లీ: ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలులో నిర్లక్ష్యంపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను నిలదీసేందుకు వైసీపీ రెడీ అయ్యింది. హస్తిన వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది. 

ప్రత్యేక హోదా ఇస్తామని, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన కేంద్రం ఆ తర్వాత దోబూచులాడటం, ప్రత్యేక హోదా అని ఒకసారి, ప్రత్యేక ప్యాకేజీ అంటూ మరోసారి ఇలా ప్రకటనలు చేసిన టీడీపీల వ్యవహార శైలిని దేశానికి తెలియజేసేలా వంచనపై గర్జించేందుకు జంతర్ మంతర్ ను వేదికగా ఎంచుకుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఢిల్లీ వేదికగా తమ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగున్నరేళ్లుగా రాష్ర్టంలో వివిధ ఆందోళనలు, నిరసనలతో ఉద్యమించిన వైసీపీ హస్తిన వేదికగా మరోమారు గర్జించింది. 

గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన దీక్షకు దిగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు పరచకుండా రాష్ట్రాన్ని వంచనకు కేంద్రం గురిచేసిందని ఆరోపిస్తూ దీక్షకు పూనుకుంది. 

ప్రత్యేక హోదా కోరుతూ ఇప్పటికే వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి పోరుబాటు పట్టారు. వంచనపై గర్జన దీక్షలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, తాజా మాజీ ఎంపీలు పాల్గొన్నారు. అలాగే భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
 
ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల సాధన కోసం వైసీపీ ఈ వంచనపై గర్జన దీక్షలను చేపట్టింది. 

కేంద్ర రాష్ట్రప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 29న విశాఖపట్నంలో తొలిసారి వంచనపై గర్జన దీక్ష చేపట్టారు. ఆ తర్వాత నెల్లూరు, అనంతపురం,గంటూరు జిల్లాలోనూ చేపట్టారు. ఇటీవలే కాకినాడలో వంచనపై గర్జన దీక్షలు చేపట్టారు. తాజాగా హస్తినలో వంచనపై గర్జన దీక్షకు దిగారు. 
 

click me!