డబ్బుల్లేవు....అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదన్నమాజీ మంత్రి

By rajesh yFirst Published 10, Sep 2018, 4:27 PM IST
Highlights

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చెయ్యడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. తన కుమారుడు పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బోసుకు ఊహించని షాక్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలు. 
 

కాకినాడ: 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను కానీ తన కుమారుడు కానీ పోటీ చెయ్యడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. తన కుమారుడు పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. రామచంద్రపురం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బోసుకు ఊహించని షాక్ ఇచ్చారు పార్టీ కార్యకర్తలు. 

 సాక్షాత్తు మాజీమంత్రి సమక్షంలోనే పార్టీ కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. బోస్ తనయుడు సూర్యప్రకాష్ వర్గంగా...నియోజకవర్గ సమన్వయకర్త వేణు వర్గంగా విడిపోయారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ స్థానికేతరుడని అతనిని నియోజకవర్గం సమన్వయ కర్తగా అంగీకరించేది లేదంటూ సూర్యప్రకాష్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. 

బోస్ తనయుడు సూర్యప్రకాష్ ను నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించాలని లేదంటే తాము సహించబోమంటూ ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. దీంతో వేణు వర్గం, సూర్యప్రకాష్ ల వర్గంగా విడిపోయారు కార్యకర్తలు. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో స్వల్ప తోపులాట జరిగింది. 
  
పార్టీ అధిష్టానం వేణును నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించిందని అందుకు క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉండాలని కానీ స్థానికేతరుడు అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని వేణు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేణు స్థానికేతరుడు కాదంటూ వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటీవల వేణుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై  చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ బోసుకు ఫిర్యాదు చేశారు. 

వ్యవహారంపై నివేదిక తయారు చేసి అధిష్టానానికి పంపాలని పార్టీ మండల కన్వీనర్ పంతగడ ప్రసాద్ ను బోస్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చెయ్యడంతో వివాదం సద్దుమణిగింది.  

2019 ఎన్నికల్లో తాను కానీ తన కుమారుడు సూర్య ప్రకాష్ కానీ పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఎమ్మెల్సీ బోస్ స్పష్టం చేశారు. ఆర్థిక సమస్యల్లో ఉన్నామని అప్పులతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వేణు అభ్యర్థిత్వాన్నే కార్యకర్తలు అంగీకరించాలని సూచించారు. వచ్చే ఎన్నికలలో అంతా ఏకమై వేణు గెలుపునకు కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. తన కుమారుడు పోటీ చేస్తాడని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 

పార్టీ అధినేత జగన్‌ నియోజకవర్గ సమన్వయకర్తగా వేణును నియమించారని ఆయన వ్యతిరేకించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఐక్యంగా ముందుకుసాగి పార్టీ ప్రతిష్టను పెంచాలని సూచించారు. ఇరువర్గాలను ఒక్కటి చేసిన బోస్ ఐక్యతను చాటారు. 

 పార్టీకి నష్టం కల్గిస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు అధిష్టానం తీసుకుంటుందని నియోజకవర్గ సమన్వయ కర్త వేణు స్పష్టం చేశారు. తన నియామకం పార్టీ నిర్ణయమని పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ బోస్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు ప్రత్యర్ధికి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వేణు. తనకుంటూ వర్గమేదీ లేదని తాను కూడా బోస్‌ వర్గమేనని నియోజకవర్గ కార్యకర్తలు గుర్తుంచుకోవాలని సూచించారు. 

Last Updated 19, Sep 2018, 9:22 AM IST