
గుంటూరు: ఇటీవల గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలను నిలదీసిన దళిత మహిళ వెంకాయమ్మను చంపాలని అధికార వైసిపి నాయకులు కుట్రలు పన్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు (pilli manikyarao) ఆరోపించారు. నిన్న తాడికొండ పోలీస్ స్టేషన్ వద్ద చోటుచేసుకున్న సంఘటనలు, ఆ తర్వాత పోలీసుల తీరును చూస్తుంటే వెంకాయమ్మతో పాటు ఆమె కొడుకును హతమార్చడానికి వైసీపీ రౌడీలు, పోలీసులు పక్కా వ్యూహం రచించినట్లు అర్థమౌతుందని మాణిక్యరావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
''కంతేరు ఘటనపై డిఐజి త్రివిక్రమ్ వర్మ మాటలు బూటకం. వెంకాయమ్మతో పాటు ఆమె కుటుంబం, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుపై దాడికి యత్నించిన నిందితులపై కేసులు పెట్టకుండా ఇరువర్గాలపై కేసులు నమోదు చేసామని డిఐజి చెప్పడం వైసీపీ రౌడీలను కాపాడటానికే. పోలీసులు బాధితులను హింసిస్తూ, రౌడీలను కాపాడుతున్నారు'' అని మాణిక్యరావు ఆరోపించారు.
''దళిత మహిళ వెంకాయమ్మను చంపాలని వైసిపి చూస్తోంది. ఇప్పటికే వైసీపీ రౌడీ మూకలు రెండుసార్లు ఆమెపై దాడిచేసారు. నిన్న ఏకంగా తాడికొండ పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ముందే వెంకాయమ్మను, ఆమె కొడుకును వైసీపీ రౌడీమూకలు చావబాదాయి. కళ్లముందే అంతా జరిగినా దాడిచేసిన నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేయడంలేదు. నిందితులతో కలిసి బాధితులను పోలీసులు కూడా వేధిస్తున్నారు. ఇలా దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పోలీస్ వ్యవస్థకే సిగ్గు చేటు'' అని మాణిక్యరావు మండిపడ్డారు.
''నిన్న(ఆదివారం) సాయంత్రం టీడీపీ ప్రతినిధుల బృందం వెంకాయమ్మ మద్దతుగా వెళ్లగా తాడికొండ పోలీసుల ఆకృత్యాలు బయటపడ్డాయి. దళిత మహిళతో పాటు టిటిడి బృందంపై దాడికి యత్నించిన వైసిపి శ్రేణులపై కేసు కడతామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. కానీ నిందితులను ఇప్పటివరకు ఆరెస్ట్ చేయలేదు. వైసీపీతో కలిసి పోలీసులు చేస్తున్న కుట్రలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని మాణిక్యరావు హెచ్చరించారు.
''ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులను ఇళ్లలో నుంచి రానివ్వకుండా ఆరెస్టులు చేస్తున్న పోలీసులే అధికారంలో వున్న వైసీపీ రౌడీ మూకలకు సలాం చేస్తున్నారు'' అని పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే:
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన టిడిపిని అభిమానురాలు వెంకాయమ్మ కుటుంబంపై అదే గ్రామానికి చెందిన కొందరు దాడికి యత్నించారు. అయితే ఇది వైసిపి నాయకులు చేయించిన పనే అంటూ వెంకాయమ్మకు టిడిపి అండగా నిలిచింది. గతంలో వైసిపి నాయకులను నిలదీసినందుకే ఆమె కుటుంబంపై కక్షగట్టి ఇలా దాడుకులకు దిగుతున్నట్లు టిడిపి ఆరోపిస్తోంది. ఇలా వెంకాయమ్మకు మద్దతుగా తాడికొండ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు, ఇతర టిడిపి నాయకులపై పోలీసుల ఎదుటే వైసిపి శ్రేణులు దాడికి యత్నించాయి. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఈ దాడులను ఖండిస్తూ టిడిపి అదినేత నారా చంద్రబాబు నాయుడు "ఛలో కంతేరు" కు టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా కంతేరులో భారీగా పోలీస్ బలగాలను మొహరించిన పోలీసులు టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కంతేరు గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమైన మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమామహేశ్వర రావుని ముందస్తుగానే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కంతేరుకు వెళుతున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఇతర నాయకులను తాడేపల్లి బైపాస్ లో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.