కదిరి వైసిపి అభ్యర్థి ప్రకటన: జగన్ సూచన మేరకేనని మిథున్ రెడ్డి

By Nagaraju TFirst Published Jan 21, 2019, 5:13 PM IST
Highlights

కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా. పి.వి.సిద్దారెడ్డిని ప్రకటించారు వైసీపీ మాజీ ఎంపీ అనంతపురం జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కదిరి చేరుకున్న ఆయన కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా.పి.వి. సిద్దారెడ్డిని ప్రకటించారు. 

అనంతపురం: కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా. పి.వి.సిద్దారెడ్డిని ప్రకటించారు వైసీపీ మాజీ ఎంపీ అనంతపురం జిల్లా ఇంచార్జ్ మిథున్ రెడ్డి. అనంతపురం జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా కదిరి చేరుకున్న ఆయన కదిరి నియోజకవర్గం అభ్యర్థిగా డా.పి.వి. సిద్దారెడ్డిని ప్రకటించారు. 

అయితే ఈ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో చాంద్ బాషా వైసీపీ తరుపున గెలిచారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సైకిలెక్కేశారు. ఆనాటి నుంచి డా.పీవీ సిద్ధారెడ్డి నియోజకవర్గ సమన్వయ కర్తగా పనిచేస్తున్నారు. తాజాగా ఆయననే నియోజకవర్గ అభ్యర్థిగా మిథున్ రెడ్డి ప్రకటించడం గమనార్హం. 

వాస్తవానికి కదిరి నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా చెప్పుకోవచ్చు.అలాంటి కంచుకోటను 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టి వైసీపీ జెండా ఎగురవేసింది. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ తరుపున గెలిచిన అభ్యర్థి అత్తర్ చాంద్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 

వైసీపీ అభ్యర్థిగా డా.పీవీ సిద్ధారెడ్డి ఖరారు కావడంతో టీడీపీ అభ్యర్థి ఎవరనేదానిపై ఆసక్తి నెలకొంది. టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా లేక వైసీపీ తరుపున గెలిచి టీడీపీలో చేరిన అత్తర్ చాంద్ బాషా నిలబడతారా అన్న సందేహం నెలకొంది. 

అయితే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని టీడీపీ ఇంచార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. కందికుంట ప్రసాద్ పై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పోటీ చేసే అవకాశం లేదని తెలుగుదేశం తరుపున అత్తర్ చాంద్ బాషాయే పోటీ చేస్తారని భావించారు. 

అయితే   కందికుంట‌ వెంకట ప్రసాద్ కి ఉమ్మడి హైకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించడంతో ఆయన పోటీకి రెడీ అవుతున్నారు. కందికుంటపై సీబీఐ కోర్టుల్లో వ‌చ్చిన తీర్పుల‌న్నింటినీ నిలుపుద‌ల చేస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వడంతో కందికుంట వెంకట ప్రసాద్ కు లైన్ క్లియర్ అయ్యింది. 

2009లో టీడీపీ తరుపున త్రిముఖ పోరులో విజయం సాధించారు. ఒకవైపు ప్రజారాజ్యం పార్టీ, మరోవైపు వైఎస్ఆర్ హవా వీటన్నింటిని తట్టుకుని గెలిచి నిరూపించారు కందికుంట. 2014 ఎన్నిక‌ల్లో స్వల్ప ఓట్లతో పరాజయం పాలయ్యారు. కందికుంటపై కేవ‌లం 654 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు అత్తర్ చాంద్ బాషా. 

 కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందడంతో కందికుంట వెంకట ప్రసాద్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. అన్ని వర్గాల వారిని కలుపుకుని మందుకు సాగిపోతున్నారు. ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసిన అనుభవం ఉండటంతోపాటు బలమైన క్యాడర్ ఉండటంతో కందికుంట వెంకట ప్రసాద్ దూసుకుపోతున్నారు. 

2019 ఎన్నికల్లో చాంద్ బాషాకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టమౌతోంది. కందికుంట వెంకట ప్రసాద్ నే బరిలోకి దించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. సర్వేలు కూడా కందికుంటవైపే మెుగ్గు చూపాయని తెలుస్తోంది. 

కందికుంట వెంకట ప్రసాద్ కి కదిరి నియోజకవర్గం టిక్కెట్ ఇస్తే అత్తర్ చాంద్ బాషా పని అయిపోయినట్లేనని అంతా చెప్పుకుంటున్నారు.ఇక బాషా తట్టా బుట్టా సర్ధుకోవాల్సిందేనని చెప్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు సైతం సర్దుకున్నాయని ప్రచారం జరుగుతోంది.

 జగన్ పాదయాత్ర వరకు కదిరి నియోజకవర్గం విషయంలో సిద్ధారెడ్డి, వ‌జ్ర‌భాస్క‌ర్ రెడ్డి సీటు నాదంటే నాదంటూ చెప్పుకునేవారు. అయితే ఎట్టకేలకు అభ్యర్థిగా సిద్ధారెడ్డిని ప్రకటించడంతో ఆయన తన ప్రచారాన్ని మరింత పెంచే యోచనలో ఉన్నారు. 

ఈ నియోజకవర్గం నుంచి జనసేన సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. బలమైన అభ్యర్థి కోసం జనసేన వేట మెుదలెట్టింది. మెుత్తానికి 2019 ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారో, ప్రజల తీర్పు ఎటువైపు ఉండబోతుందోనన్నది ఆసక్తిగా మారింది. 


 

click me!