ఆర్థిక సంఘం నిధుల అక్రమ మళ్లింపు.. సర్పంచ్‌లపై కేసు ఎత్తేయాలి: జగన్‌కు నారా లోకేష్ లేఖ

By Mahesh KFirst Published Oct 12, 2022, 6:57 PM IST
Highlights

కేంద్ర ఆర్థిక సంఘం నిధులను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిందని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. తద్వార పంచాయతీ ఖాతాల్లో నిధుల్లేక సర్పంచులు తంటాలు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
 

అమరావతి: టీడీపీ నేత నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 14,5వ ఆర్థిక సంఘం నిధులను ప్రస్తావిస్తూ ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ రకరకాల పేర్లు చెప్పి దారి మళ్లించిందని, సర్పంచ్‌లను నిస్సహాయులను చేసిందని పేర్కొన్నారు. ఈ దోపిడీని నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళనలకు దిగిన సర్పంచ్‌లపై కేసు పెట్టడం శోచనీయం అని, ఆ కేసులను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఆర్థిక సంఘం నిధులు వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

14, 15 ఆర్థిక సంఘం నుంచి కేంద్రం మంజూరు చేసిన రూ. 7,660 కోట్లను పంచాయతీల ఖాతాల నుంచి వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని నారా లోకేష్ ఆరోపించారు. ఇటీవలే కేంద్రం విడుదల చేసిన రూ. 948 కోట్లనూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. ఆ సొమ్మును విద్యుత్ బిల్లులకు చెల్లించామని పేర్కొనడం దుర్మార్గమని తెలిపారు. 1984 నుంచి జీపీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే ఇప్పుడు విద్యుత్ బిల్లుల పేరుతో లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక సంగం నిధుల్లో 10 శాతం నిధులు మాత్రమే విద్యుత్ అవసరాలకు వాడాలనే నిబంధన ఉన్నదని గుర్తు చేశారు. అదీ చెక్కులపై సర్పంచుల సంతకాలు లేకుండా నిధులు లాక్కోవడం చోరీ చేయడమేనని ఎద్దేవా చేశారు. లేదంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

విద్యుత్ బకాయిల కోసమే నిజంగా నిధులు మళ్లిస్తే.. ఒక్కో పంచాయతీకి సగటున రూ. 60 లక్షల బిల్లు వచ్చిందనడం సరైనదేనా? అని నిలదీశారు. ఈ నిర్ణయం కారణంగా పంచాయతీల ఖాతాల్లో నిధుల్లేక సర్పంచ్‌లు పాలన గాలికొదిలేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఈ కారణంగా ఆందోళనలకు దిగిన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాపారావు సహా 32 మందిపై కేసులు పెట్టి అరెస్టు చేశారని, ఇది దుర్మార్గం అని వివరించారు. పంచాయతీల నిధులు అక్రమంగా మళ్లించవద్దని సర్పంచులు నిరసన చేయడం నేరమా? అని ప్రశ్నించారు. అంతేకాదు, సర్పంచ్‌లు న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తున్న గౌరవ వేతనం, హెల్త్ కార్డులు, బీమా, ప్రొటోకాల్ అంశాలు వెంటనే పరిష్కరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.

click me!