రఘురామకృష్ణమ రాజుకు వైసీపీ షాక్: పార్లమెంటులో సీటు వెనక్కి

By telugu teamFirst Published Jul 18, 2020, 12:05 PM IST
Highlights

తమ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజుకు వైసీపీ షాక్ ఇచ్చింది. లోకసభలో ఆయన సీటును మార్చేసింది. రఘురామకృష్ణమ రాజు సీటు మారుస్తూ లోకసభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.

న్యూఢిల్లీ: తమ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణమ రాజుకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ షాక్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సీటును పార్లమెంటులో వెనక్కి మార్చింది. గతంలో నాలుగో లైన్ లో ఉన్న ఆయన సీటును ఏడో లైన్ లోకి మారుస్తూ లోకసభ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. 

వైసీపీ పక్ష నేత ఇచ్చిన సూచన మేరకు ఈ మార్పులు చేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఏడో లైన్ లో ఉన్న వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సీటును ఆయనకు కేటాయించారు. భరత్ కు రఘురామ కృష్ణమ రాజు సీటు కేటాయించారు. 

రఘురామకృష్ణమ రాజు 379వ సీటులో ఉండేవారు. ఇప్పుడు 445వ సీటుకు మారారు. మార్గాని భరత్ 385 నుంచి 379కు వచ్చారు. వారితో పాటు కోటగిరి శ్రీధర్ సీటును 421 నుంచి 385కు మార్చారు. బెల్లన చంద్రశేఖర్ సీటును 445 నుంచి 421 మార్చారు.

రఘురామకృష్ణమ రాజు గత కొంత కాలంగా వైసీపీ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దానికి రఘురామకృష్ణమ రాజు సమాధానం ఇవ్వకుండా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. 

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. ఈ మేరకు వారు అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై కూడా రఘురామకృష్ణమ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు

click me!