‘‘ఈరోజూ నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన రోజు... పదేళ్లుగా నగరికి పట్టిన శని వదిలింది... ఈ ఆనందాన్ని నగరి ప్రజలందరితో మేము కూడా పంచుకుంటున్నాం... రోజా అడుగు పెట్టిన రోజే వైసీపీకి శని పట్టింది.... రోజాకు సీటివ్వకపోతే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు.... నగరి నా అడ్డా, గడ్డా అంటూ అవినీతి పాలన చేశారు....’’ ప్రత్యర్థి పార్టీ నాయకులు అన్న మాటలు కావివి. రోజాపై వైసీపీ నాయకురాలు కేజే శాంతి చేసిన వ్యాఖ్యలివి. రోజా ఓటమి ఆనందంగా ఉందంటూ శాంతి విడుదల చేసిన వీడియో సంచలనం రేపుతోంది..
ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడంలో రోజా ఎప్పుడూ ముందుంటారు. వైసీపీ హయాంలో జగన్‌ను గానీ, వైసీపీ ప్రభుత్వాన్ని గానీ ఎవరైనా విమర్శిస్తే దారుణంగా కౌంటర్ ఇచ్చేవారు. అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం అసమ్మతి సెగను పోగొట్టుకోలేకపోయారు. నగరిలో రెండుసార్లు గెలిచిన రోజా... సొంత పార్టీలోనే అసమ్మతి కారణంగా ఈసారి ఘోరంగా ఓడిపోయారు.
నగరిలోని తెలుగుదేశం అభ్యర్థి గాలి భానుప్రకాశ్ 45వేల పైచిలుకు మెజారిటీతో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఘన విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన రోజా మాత్రం 62,793 వేల ఓట్లే రాబట్టగలిగారు. ఈ క్రమంలో రోజా పరిస్థితి 'అత్త తిట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు బాధ' అన్న చందంగా మారింది. ఓటమికి కారణాలు వెతుక్కుంటూ తదుపరి పరిణామాలను ఎదుర్కొనేందుకు రోజా, ఆమె వర్గం సిద్ధమవుతుంటే... మరోవైపు ఆమె వ్యతిరేక వర్గం సంబరాలు చేసుకుంటోంది. వైసీపీలోనే ఆమెకు అసమ్మతి తగలడం, ఆ వర్గం రోజా ఓటమిపై సంతోషం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాధను పంచుకోవాల్సిన, సానుభూతి చూపించి మద్దతుగా ఉండాల్సిన సొంత పార్టీ కేడరే... సంబరాలు చేసుకుంటుండటంతో నగరిలో రోజా పరిస్థితి దారుణంగా తయారైంది.
undefined
నగరిలోని మంత్రి ఆర్కే రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజా ఓటమిపై ఆనందం వ్యక్తం చేస్తూ నగరి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ కేజే శాంతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ మారింది. పదేళ్లుగా నగరికి పట్టిన శని విరగడైందంటూ ఆమె వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా కుటుంబ పాలనతో నగరి నియోజవకర్గంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణలు చేశారు. అందు వల్లే నగరి ప్రజలు రోజాను భూస్థాపితం చేశారని చెప్పారు.
కాగా, ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు రోజు వరకు.. మళ్లీ వైసీపీ వస్తుందని రోజా ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజు అంతా మౌనంగా ఉన్నారు. ఫలితాలు వెలువడక ముందే.. నగరిలో కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే రోజా వెళ్లిపోయారు. ఆ తర్వాత నగరిలోని ఇంటికే పరిమితమయ్యారు. పోలింగ్ రోజు తన వ్యతిరేక వర్గంపై రోజా విమర్శలు గుప్పించారు. తన పార్టీ వాళ్లే తనకు సహకరించడం లేదని వాపోయారు. ఇప్పుడు బహిరంగంగా రోజా ఓటమిపై వీడియోలు విడుదల చేయడంపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.....
నగరిలోని రోజా, శాంతివి వేర్వేరు వర్గాలు. మొదటి నుంచి ఒకరంటే మరొకరికి పడదు. సాక్షాత్తూ సీఎం జగనే వారిని కలపాలని చూసిన కుదరలేదు. అనేకసార్లు ఆర్కే రోజా, కేజే శాంతి వర్గాలు నేరుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నాయి.
కాంగ్రెస్ కంచుకోట
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పగానే.. మంత్రి రోజానే గుర్తొస్తారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు రోజా. నగరి అంటే రోజా.. రోజా అంటే నగరి అన్నంతగా చెరగని ముద్ర వేశారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ పరిధిలో నింద్రా, విజయాపుపరం, నగరి, పుత్తూరు, వడమాలపేట మండలాలున్నాయి.
ఛాన్స్ కొట్టేసిన రోజా
2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పుత్తూరు నియోజకవర్గం రద్దయి.. వడమాల, పుత్తూరు మండలాలు నగరి పరిధిలోకి వచ్చాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు గెలిచారు. 2014లో సినీనటి రోజా వైసీపీ అభ్యర్ధిగా తొలుత విజయం సాధించారు. ఆ తర్వాతి నుంచి నగరిని ఆమె తన అడ్డాగా చేసుకున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు 80,333 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్‌కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా 1352 ఓట్ల తేడాతో వరుసగా రెండో విజయం అందుకుని వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.