ఉపాధ్యాయుల అరెస్టులా... వారేమన్నా నీ లోటస్ పాండ్ లో వాటా అడిగారా?: సీఎం జగన్ పై యనమల ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Apr 25, 2022, 01:39 PM ISTUpdated : Apr 25, 2022, 01:42 PM IST
ఉపాధ్యాయుల అరెస్టులా... వారేమన్నా నీ లోటస్ పాండ్ లో వాటా అడిగారా?: సీఎం జగన్ పై యనమల ఫైర్

సారాంశం

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు టిడిపి నాయకులు యనమల రాామకృష్ణుడు మద్దతుగా నిలిచారు. 

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (ys jagan) నియంతృత్వ పోకడ రోజురోజుకీ హద్దుమీరి పోతున్నాయని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) ఆందోళన వ్యక్తం చేసారు. హక్కుల కోసం పోరాడుతున్న వారిపై, వైసీపీ పాలనా వైఫల్యాల్ని ఎండగడుతున్న వారిపై జగన్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. ఇలా ప్రతిపక్షాలనే కాదు ప్రజలనూ అడుగడుగునా అణగద్రొక్కుతున్నారని యనమల ఆరోపించారు. 

''రాజ్యాంగం ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్చ, తమ హక్కుల కోసం పోరాడే హక్కు కల్పించింది. కానీ ఆ హక్కుల్ని కాలరాస్తూ.. బుల్డోజర్ వ్యవస్థను రాష్ట్రంపై జగన్ రెడ్డి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉఫాద్యాయులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అరెస్టులతో అడ్డుకోవాలని చూడడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల్లో మీరిచ్చిన హామీ నెరవేర్చమంటున్నారు తప్ప జగన్ రెడ్డి లోటస్ పాండ్ లో వాటా అడగటం లేదు కదా?  ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఏంటి?'' అని యనమల ప్రశ్నించారు. 

''ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రజల హక్కు. ఆ హక్కుని సైతం హరించేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యాయుల ధర్నాకు ప్రభుత్వం ఆంక్షలు విధించి దారి పొడవునా ముళ్ల కంచెలు విధించటం, ఒక్కో ఉపాధ్యాయునికి ముగ్గురు పోలీసుల్ని కాపలా పెట్టడం ఆక్షేపనీయం.  జగన్ రెడ్డి పాలనలో ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్ సరిహద్దుల్లో కూడా లేవు.  ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించేవారిని, ఇచ్చిన హామీలు అమలు చేయమని శాంతియుతంగా పోరాడుతున్న వారిపై  పోలీసుల్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి ‎ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు నిలబెట్టారు. మరుగుదొడ్లు కడిగించారు. బయోమెట్రిక్ పేరుతో వేధించారు. తాజాగా వేసవి సెలవుల సమయంలోనూ ఉపాధ్యాయులు స్కూళ్లకు రావాల్సిందే అంటూ ఉత్తర్వులిచ్చారు. ఇన్ని రకాలుగా ఉపాద్యాయుల సేవల్ని వాడుకుంటూ.. హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం జగన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనం. హక్కుల కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్టు చేయడమంటే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కడమే. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి'' అని యనమల డిమాండ్ చేసారు. 

ఇదిలావుంటే ఉపాధ్యాయ సంఘం చేపట్టే ఆందోళనకు ఎలాంటి అనుమతిలేదని... గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీసులు తెలిపారు. తాడేపల్లి బైపాస్ లో సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులు మొహరించారు. మూడు జిల్లాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు జాతీయ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేసారు.  

ప్రకాశం బ్యారేజ్,  అవనిగడ్డ కరకట్ట పై పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంగళగిరి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డు కు మద్యలో ఇనుప ముళ్ల కంచె ఏర్పాటుచేసారు. చినకాకాని వై జంక్షన్, తెనాలి ఫ్లైఓవర్, డిజిపి ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!