ముళ్ళ కంచెలతో... కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తున్న తాడేపల్లి: అచ్చెన్న సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Apr 25, 2022, 12:35 PM ISTUpdated : Apr 25, 2022, 12:37 PM IST
ముళ్ళ కంచెలతో... కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తున్న తాడేపల్లి: అచ్చెన్న సీరియస్

సారాంశం

పోలీసుల ఆంక్షలతో ప్రస్తుతం తాడేపల్లి కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోందని మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేసారు. ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అడ్డమైన హామీలిచ్చి ఇప్పుడు తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. 

అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF)  ఛలో సీఎంవో కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాడేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు 144సెక్షన్ విధించిన ప్రభత్వం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. ఇలా పోలీసుల సాయంతో ఉపాధ్యాయుల నిరసనను అడ్డుకోడానికి జగన్ సర్కార్ ప్రయత్నించడంపై ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.   

''గతంలో కేవలం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనే అధికార దాహంతో జగన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడు. ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అడ్డమైన హామీలను గుప్పించారు. ప్రచార సమయంలో చిటికెలేసి మరీ అన్ని సభల్లోనూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇలా చెప్పిన మాట ముఖ్యమంత్రి మర్చిపోయినా... ఆయనను నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. ఇచ్చిన హామీనే అమలు చేయాలని అడుగుతుంటే ఉపాధ్యాయ సంఘాలను నేతలను అరెస్టులు చేస్తున్నారు'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

''తాడేపల్లి ప్రాంతమంతా ముళ్లకంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. న్యాయబద్ధమైన హక్కులను అడిగితే అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అరెస్టు చేసిన ఉపాధ్యాయ సంఘం నాయకులను విడుదల చేయాలి'' అని డిమాండ్ చేసారు. 

''సీఎం జగన్ అబద్ధమాడడు... మాట ఇస్తే తప్పడు అంటూ సినిమా డైలాగులు కొట్టారు. ఇప్పుడు ఇచ్చిన మాట మీద జగన్ రెడ్డి నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ కు అవగాహన లేక సీపీఎస్ రద్దు చేస్తానన్న హమీ ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే చర్యలు ముఖ్యమంత్రి ఎందుకు చేపట్టడం లేదు. తాడేపల్లిలో తప్పించుకున్నామని సంబరపడ్డా భవిష్యత్ లో రాష్ట్రంలో తిరిగేటప్పుడైనా నిరసనలు ఎదుర్కోక తప్పదు'' అని హెచ్చరించారు. 

''పీఆర్సీ అమలులోనూ వైసిపి ప్రభుత్వం ఉద్యోగులను నిలువునా మోసం చేశారు.  ఉద్యోగులకు కనీసం జీతం కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. జగన్ రెడ్డి చేసిన మోసాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ నిలదీయాలి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది. జగన్ రెడ్డి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు ఉద్యోగుల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్ధతు తెలుపుతుంది'' అన్నారు. 

ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలియజేయకుండా మోహరించిన పోలీసులు సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాహనాలు తనిఖీతో పాటు బస్సుల రవాణాను కూడా నిలిపివేసి సామాన్యులను కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వ దుర్మార్గ చర్యలతో ఉపాధ్యాయులే కాదు సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. 

ఇదిలావుంటే ఉపాధ్యాయ సంఘం చేపట్టే ఆందోళనకు ఎలాంటి అనుమతిలేదని... గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీసులు తెలిపారు. తాడేపల్లి బైపాస్ లో సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులు మొహరించారు. మూడు జిల్లాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు జాతీయ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేసారు.  

ప్రకాశం బ్యారేజ్,  అవనిగడ్డ కరకట్ట పై పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంగళగిరి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డు కు మద్యలో ఇనుప ముళ్ల కంచె ఏర్పాటుచేసారు. చినకాకాని వై జంక్షన్, తెనాలి ఫ్లైఓవర్, డిజిపి ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్