నాన్ ఫెర్ఫార్మెన్స్, కరెప్ట్ సిఎంగా జగన్... రాష్ట్రానికే గుదిబండ: యనమల ధ్వజం

By Arun Kumar P  |  First Published Dec 30, 2020, 4:38 PM IST

కరోనా సాకుతో తమ చేతగానితనం కప్పి పెట్టుకునే ప్రయత్నాల్లో సీఎం జగన్ ఉన్నారని టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.


గుంటూరు: రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తొలి ఏడాది(2019-20) రాష్ట్ర రాబడులు, ఆర్ధిక పరిస్థితి బాగావున్నా అభివృద్ది లేదు, సంక్షేమం మాత్రం లేదన్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఇలా జగన్ కు అన్నీ వున్నా తన చేతగానితనంతో ఏమీ చేయలేక పోయాడని మండిపడ్డారు.. నాన్ ఫెర్ఫార్మెన్స్ సిఎంగా జగన్ రెడ్డి మిగిలాడని ఆరోపించారు.

''ఇక రెండవ ఏడాది(2020-21)లో కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధికాభివృద్ది రేటు పడిపోయింది.  కరోనా సాకుతో తమ చేతగానితనం కప్పి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రెండేళ్లలో అటు జగన్ రెడ్డి చేతగానితనం, ఇటు కరోనా రెండూ రాష్ట్రంపై దుష్ఫలితాలు చూపాయి. ఈ రెండింటి(చేతగానితనం, కరోనా) వల్ల నష్టపోయింది ప్రజలే..రాబోయే మూడో ఏడాది కూడా ఈ రెండింటి దుష్ఫలితాలే ఎదుర్కోవాలి. ఈ రెండింటి (జగన్ రెడ్డి చేతగానితనం, కరోనా) దెబ్బతో మూడో ఏడాది కూడా ముదనష్టమే'' అని యనమల పేర్కొన్నారు.

Latest Videos

''రెండు బడ్జెట్లలో రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదు. మూడో బడ్జెట్ కూడా అన్ రియలిస్టిక్ బడ్జెట్టే. మూడేళ్ల ప్రభావం నాలుగో ఏడాదిపై పడుతుంది. ఇక చివరి ఏడాది ఎన్నికల ప్రభావం ఉంటుంది. కరోనా ప్రభావంతో జిఎస్డిపి 16%  పడుతుందని ఆర్ధిక నిపుణుల అంచనా. దీని ప్రకారం మన రాష్ట్ర జిఎస్ డిపి రూ2లక్షల కోట్లు తగ్గిపోతే ఆర్ధిక పరిస్థితి మరింత కుదేలు అవుతుంది. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఎకానమి ఎలా పెంచుకోవాలో తెలియదు, కేంద్రం నుంచి రాబట్టుకోవడం చేతకాదు'' అని మండిపడ్డారు.

''విభజన చట్టంలో ఏపికి ఒనగూడే ప్రయోజనాలను గాలికి వదిలేశారు. రాష్ట్రంలోని 13జిల్లాలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ది లేదు, ఒక్క సిమెంట్ రోడ్డుగాని, ఒక్క భవనం గాని కొత్తగా కట్టలేదు, అసంపూర్తి నిర్మాణాలు పూర్తి చేయలేదు. జగన్ రెడ్డి  సిఎం అయ్యాక రాష్ట్రంలో ఇన్వెస్ట్ మెంట్స్ లేవు. పెట్టుబడులు రాకపోవడంతో పారిశ్రామికాభివృద్ది లేదు. యువత ఉపాధి అవకాశాలను దెబ్బతీశారు. ఇసుక లేక లక్షలాది భవన నిర్మాణ కార్మికుల ఉపాధి కోల్పోయారు. లక్షలాది వలస కార్మికుల జీవనోపాధి పోయింది. ఉపాధి నష్టమే తప్ప ఉపాధి కల్పన లేదు(జాబ్ లాస్ తప్ప జాబ్ క్రియేషన్ లేదు)'' అంటూ యనమల విమర్శించారు.

''టిడిపి తెచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దుచేశారు. వైసిపి తెచ్చిన పథకాల్లో అన్నీ ఆంక్షలు, కోతలే..ఒకచేత్తో ఇచ్చినట్లే ఇచ్చి వంద చేతులతో గుంజుకుంటున్నారు.తత్ఫలితంగా రాష్ట్ర రాబడులతో పాటు, వ్యక్తుల నిజ ఆదాయాలు పడిపోయాయి. సహజ వనరుల సద్వినియోగం బదులుగా వైసిపి దోపిడి పేట్రేగింది. శాండ్- ల్యాండ్ మాఫియా, లిక్కర్- మైనింగ్ మాఫియా అరాచకాలు పెరిగాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే, వైసిపి వాళ్ల సొంత ఖజానాలు మాత్రం నిండిపోయాయి'' అన్నారు.

''చెడుదే రాజ్యంగా మారింది(రైజ్ ఆఫ్ ఈవిల్). సైతాన్లు అంతా రెచ్చిపోతున్నారు. హత్యలు-అత్యాచారాలు, భూకబ్జాలు-అవినీతి కుంభకోణాలు, దాడులు-దౌర్జన్యకాండతో అశాంతి-అభద్రత ప్రబలింది. ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ భయపడే పరిస్థితి తెచ్చారు. వైసిపి ‘‘గవర్నమెంట్ టెర్రరిజం’’తో బెంబేలెత్తేలా చేశారు. న్యాయవ్యవస్థపై కూడా దాడికి తెగబడ్డారు. జడ్జిలపై దుర్భాషలు, సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగులతో దుష్ప్రచారం చేస్తున్నా చర్యలు లేవు. జగన్ జంగిల్ రాజ్ గా రాష్ట్రాన్ని మార్చారు'' అని ఆరోపించారు.

''వైసిపి ఎమ్మెల్యేలే గ్యాంగ్ లను వెంటేసుకుని ప్రత్యర్ధుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, హింసా విధ్వంసాలు పెరిగిపోయాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు, కొందరు పోలీసులు వైసిపి వాళ్లతో కుమ్మక్కై అరాచక శక్తులకు ఊతంగా మారారు. రాజ్యాంగాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాశారు'' అన్నారు.

''స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా అభివృద్ది నిధులకు మోకాలడ్డారు. బిసి రిజర్వేషన్లను 10%కోత పెట్టారు, 34%నుంచి 24%కు తగ్గించారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో బీసిలను వేధిస్తున్నారు. దళితులపై దమనకాండకు పాల్పడుతున్నారు. గిరిజనుల హక్కులను హరించారు. ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలకు అంతే లేదు. మహిళలకు భద్రత లేకుండా పోయింది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

''880మంది రైతులు  ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మద్దతు ధరలో మోసం, ఇన్సూరెన్స్ లో మోసం, సున్నావడ్డీలో మోసం, ఇన్ పుట్ సబ్సిడిలో  మోసం, భరోసాలో మోసం..రాష్ట్రంలో రైతులను దారుణంగా మోసం చేశారు.పెద్దఎత్తున దుబారా వ్యయం చేస్తున్నారు. సీఎం సొంత మీడియా యాడ్స్ కు వంద కోట్లు దుర్వినియోగం చేశారు. ఏడాదిన్నరలో రూ లక్షన్నర కోట్ల అప్పులు చేశారు. ప్రజలపై రూ70వేల కోట్ల పన్నులు, సుంకాల భారాలు వేశారు. ఇటువంటి విధ్వంస పాలన, అవినీతి పాలన, రాక్షస పాలనను దేశ చరిత్రలో చూడలేదు'' అంటూ యనమల విరుచుకుపడ్డారు. 

click me!