అచ్చెన్నాయుడు అరెస్ట్... రాక్షస పాలనకు నిదర్శనమిదేనన్న యనమల

By telugu news teamFirst Published Jun 12, 2020, 10:13 AM IST
Highlights

ఆరోపణలు, ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 
 

టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఎదుగుతున్న బీసీ నేతను చూసి ఓర్వలేక అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు.

 అచ్చెన్నాయుడి కుటుంబ నిబద్ధత, నిజాయితీ అందరికీ తెలుసన్నారు. బీసీ సంఘాలన్నీ ఇటువంటి దుర్మార్గాలను ఖండించాలని తెలిపారు. ఆరోపణలు, ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 

కాగా.. ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే అచ్చెనాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం నిమ్మాడలో ఆయనను అరెస్టు చేశారు. ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 

భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు.

అచ్చెన్నాయుడు సిఫార్సుల కారణంగానే అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ (టీడీఎల్పీ) ఉప నేతగా ఆయన ఉన్నారు. శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అచ్చెన్నాయుడి అరెస్టు జరిగింది. 

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు రూ.988 కోట్ల కొనుగోళ్లు జరిగాయని, ఇందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు గుర్తించారు. 

అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.  

మరో మాజీ మంత్రి పాత్ర కూడా ఈసీఐ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం 40 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మందులు, పరికరాలు,ల్యాబ్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ కొటేషన్లతో వ్యవహారం నడిపినట్లు తేలింది. 

click me!