యానాంలో ఎమ్మెల్యే అభ్యర్థి కిడ్నాప్... ఏపీలో ప్రత్యక్షం

By Arun Kumar PFirst Published Apr 5, 2021, 9:47 AM IST
Highlights

ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్ధి మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురయిన ఘటన యానాంలో చోటుచేసుకుంది. తాజాగా సదరు అభ్యర్థి ఆచూకీ ఆంధ్ర ప్రదేశ్ లో లభించింది.  
 

కాకినాడ: పుదుచ్చెరిలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అభ్యర్ధులు ప్రచారంలో మునిగిపోయారు. ఇలా ప్రచారం నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ స్వతంత్ర అభ్యర్ధి మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురయిన విషయం తెలిసిందే. తాజాగా సదరు అభ్యర్థి ఆచూకీ ఆంధ్ర ప్రదేశ్ లో లభించింది.  

పుదుచ్చెరి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా యానాంలో పెమ్మాడి దుర్గాప్రసాద్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే అతడు ఇటీవల కిడ్నాప్ కు గురయి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆచూకీ గాలింపు చేపట్టారు. అయితే అతడి ఆచూకీ కాకినాడలో లభించింది. అపస్మారక స్థితిలో వున్న అతడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. 
 
ఆదివారం రాత్రి అతడు కాకినాడలో వున్నట్లు తెలియడంతో పుదుచ్చెరి నుండి ఎస్పీ రాహుల్ ఆల్వాల్ వచ్చి విచారణ చేపడుతున్నారు. దుర్గాప్రసాద్ ఎమ్మెల్యేగా పోటీచేయడం వలన నష్టపోతామనుకున్న ఓ ప్రధాన పార్టీ నాయకుడు ఈ కిడ్నాప్ చేయించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

దుర్గాప్రసాద్‌ స్థానిక బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేయాలని భావించిన అతడికి పార్టీ టికెట్ లభించలేదు. ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థి రంగస్వామి యానాం నుండి పోటీ చేస్తుండటంతో అతడికి పోటీగా దుర్గాప్రసాద్ బరిలో నిలిచారు. దీంతో బిజెపి అతడిని సస్పెండ్ చేసింది. ఈ క్రమంలోనే అతడి కిడ్నాప్ సంచలనంగా మారింది. 


 

click me!