యాస్ తుఫాను భీభత్సం ఖాయం... ఏపీ పరిస్థితి ఇదీ..: ఐఎండీ హెచ్చరిక

By Arun Kumar P  |  First Published May 25, 2021, 10:37 AM IST

యాస్ తుఫాను ప్రభావంతో నేడు(మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. 


విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇప్పటికే తుఫానుగా మారిన విషయం తెలిసిందే. ఈ యాస్ తుఫాను ప్రభావంతో నేడు(మంగళవారం) ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే రేపు(బుధవారం)కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు. 

ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్‌ తీరంలో గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు వున్నాయన్నారు. ఈ నెల 26వ తేదీ అంటూ రేపు తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్రలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని... ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. 

Latest Videos

read more  తుఫానుగా మారిన వాయుగుండం... తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉండనుందంటే...

తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే తీవ్రత కొనసాగుతుందన్నారు. మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ నెల 25 నుంచి 27లోపు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 

సముద్రంలో చేపల వేటపై నిషేధ హెచ్చరికలు కొనసాగుతున్నాయన్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి యాస్‌ తుపాను గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోందని పేర్కొన్నారు. అది ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో, పారాదీప్‌కి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

click me!