ప.గో జిల్లాలో దారుణం... ఉరేసుకుని మహిళ ఆత్మహత్య... కంటతడి పెట్టిస్తున్న ఆడియో రికార్డింగ్

By Arun Kumar PFirst Published Jan 24, 2022, 1:41 PM IST
Highlights

ఎంతటి కష్టం వచ్చిందో ఏమో ఓ 30ఏళ్ల మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

ప.గో జిల్లా: ఏ కష్టం వచ్చిందో తెలీదు గానీ ఓ మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district)లో చోటుచేసుకుంది. అయితే మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులు, బంధువులు రహస్యంగా ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా అనుమానం వచ్చిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మహిళ ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం గ్రామంలో మేరీ ప్రసన్న కుమారి(30) అనే మహిళ నివాసముండేది. అయితే కారణమేంటో తెలీదుగానీ ఆమె ప్రాణాలు తీసుకోవాలన్న దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

అయితే మేరి ప్రసన్న మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు, బంధువులు ఆత్మహత్య విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. హడావుడిగా అంత్యక్రియలు జరపడానికి సిద్దపడగా గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఏవయినా ఆధారాలు దొరుకుతాయని ఆమె సెల్ ఫోన్ ను పరిశీలించారు. అందులో ఆత్మహత్యకు ముందు యువతి రికార్డ్ చేసుకున్న ఓ ఆడియోను పోలీసులు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ యువతి ఆడియో రికార్డ్ లో పేర్కొంది. 

అయితే గ్రామస్తులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు తీవ్రంగా వేధించడం వల్లే ఆమె మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రసన్న కుమారి మృతికి కారణమైన వారిని వదిలిపెట్టవద్దని... గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు. 

మహిళ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆడియో రికార్డింగ్, గ్రామస్తుల అనుమానాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న కుమారి బంధువులు, స్నేహితులతో పాటు మరికొందరి నుండి వివరాలను సేకరిస్తున్నారు. తన ఆత్మహత్య ముందు యువతి రికార్డ్ చేసిన ఆడియో విన్నవారికి కంటతడి పెట్టిస్తోంది. 

ఇదిలావుంటే అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ బ్యాంక్ ఉద్యోగి భార్య ఆత్మహత్య (suicide) చేసుకుంది. ఈ అమానుషం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ తాడిమర్రిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో పనిచేస్తున్నాడు. 2016లో అతడికి వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి  దంపతుల కుమార్తె వెంకట సుజన(26)ను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి సమయంలో రూ. 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు సుజన తల్లిదండ్రులు కట్నం కింద అల్లుడికి అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అయితే అదనపు కట్నం కోసమే వేధింపులకు గురి చేసి.. తమ కుమార్తెను హతమార్చి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని వెంకటకృష్ణ కుటుంబ సభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు డీఎస్పీ రమాకాంత్ కు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు... మృతురాలి భర్త ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

click me!