విడిపోయిన తల్లిదండ్రులు.. కలపాలని ప్రయత్నించినా...

By telugu news teamFirst Published Jul 16, 2020, 11:15 AM IST
Highlights

తల్లిదండ్రులను కలిపేందుకు పిల్లలు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇవి ఫలించకపోవడంతో గాయత్రి మనస్తాపానికి గురైంది. తన బాధను కుటుంబ సభ్యులతో వ్యక్తంచేసేది.

వాళ్లకు ఊహ తెలిసే సమయానికే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. వారిద్దరినీ ఎలాగైనా కలపాలని ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కలపలేకపోయారు. దీంతో.. మనస్థాపం చెందిన ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర సంఘటన చిత్తూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...తిరుపతిలోని దర్జీ మునిరాజ, ఆయన భార్య నాగరత్నమ్మ తొమ్మిదేళ్ల క్రితం విడిపోయారు. వీరి కుమార్తెలు లావణ్య, గాయత్రి తల్లితో కలిసి తాతయ్యకట్ట వినాయకనగర్‌లో నివసిస్తున్నారు. కూలిపనులు చేస్తూ నాగరత్నమ్మ కుమార్తెలను చదివిస్తోంది.


చిన్నకుమార్తె గాయత్రి (20) సంస్కృత విద్యాపీఠంలో యోగా మూడో సంవత్సరం చుదువుతోంది. తల్లిదండ్రులను కలిపేందుకు పిల్లలు కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఇవి ఫలించకపోవడంతో గాయత్రి మనస్తాపానికి గురైంది. తన బాధను కుటుంబ సభ్యులతో వ్యక్తంచేసేది. ఈ క్రమంలో టీ చేసుకుని వస్తానంటూ బుధవారం వంట గదిలోకి వెళ్లిన ఆమె కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. 

మంటలు రావడంతో వరండాలోని కుటుంబ సభ్యులు ఇంట్లోకిరాగా గాయత్రి మంటల్లో కాలిపోతూ కనిపించింది. చుట్బుపక్కల వారందరూ కలిసి మంటలార్పారు. అప్పటికే తీవ్రగాయాలైన ఆమె మృతిచెందింది. ఈస్ట్‌ ఎస్‌ఐ జయచంద్ర ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫొరెన్సిక్‌ నిపుణులు నమూనాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయాకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శివప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

click me!