ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయం.. మొత్తం రూ.800 కోట్లు

By Siva KodatiFirst Published Jun 28, 2022, 8:27 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోంచి నగదు మాయమైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని రూ.800 కోట్లు విత్ డ్రా అయినట్లుగా ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌‌లోని (ap govt employees) వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్‌ ఖాతాల (gpf accounts) నుంచి డబ్బులు మాయమవ్వడం సంచలనం సృష్టించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ (suryanarayana) మీడియాకు తెలియజేశారు. ఉద్యోగుల ఖాతాల నుంచి నగదు విత్‌ డ్రా చేసుకున్నట్టు గత రాత్రి మొబైల్స్‌కు మెసేజ్‌లు వచ్చాయన్నారు. తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83వేలు విత్‌డ్రా చేశారని సూర్యనారాయణ పేర్కొన్నారు. డబ్బులు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని.. పీఆర్సీ డీఏ ఎరియర్స్‌ జీపీఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నారని, గడచిన 6 నెలలుగా ఇచ్చిన డీఏ ఎరియర్స్‌ను మళ్లీ వెనక్కి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.   

గతంలోనూ ఇదే తరహాలో జరిగితే ఫిర్యాదు చేస్తే మళ్లీ తిరిగి ఖాతాల్లో నగదు వేశారని సూర్యనారాయణ గుర్తు చేశారు. తాజాగా మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు వెనక్కి తీసుకున్నారని ఆయన తెలిపారు. ఆర్థికశాఖకు ఫిర్యాదు చేసేందుకు వెళితే... అధికారులు అందుబాటులో లేరని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలు ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదని ఆయన ఆరోపించారు.  

ఉద్యోగుల సమ్మతి లేకుండా వారి ఖాతాల నుంచి సొమ్ము విత్‌డ్రా చేయడం నేరమని సూర్యనారాయణ హెచ్చరిస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని ఆయన తెలిపారు. మార్చి నెలలో జరిగిన లావాదేవీలను అకౌంటెంట్‌ జనరల్‌ తమకు ఇప్పటి వరకు తెలియజేయకపోవడం కూడా తప్పిదమేనని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆర్థిక శాఖలోని సీఎఫ్ఎంఎస్ లో ఉన్న సీపియూ యూనిట్ వద్ద తమ వేతన ఖాతాల నుంచి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందని, ఇది ఎంత వరకు చట్టబద్దమని ఆయన ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరగాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేస్తున్నారు.  

click me!