సినీ పరిశ్రమకు హైదరాబాద్ వదిలే ఉద్దేశ్యముందా ?

First Published Nov 15, 2017, 11:55 AM IST
Highlights
  • రాష్ట్ర విభజన అయిన రోజుల్లోనే హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమ ఏపికి తరలి వెళిపోతుందని ఎందరో ప్రముఖులు ఎన్నో సార్లు చెప్పారు.
  • కానీ విభజన జరిగి మూడున్నరేళ్ళయినా ఒక్క ఇంచైనా కదిలిందా?

‘సినీ పరిశ్రమను విశాఖపట్నంకు తరలించాలని ఎక్కువ మంది కోరుతున్నారు’..

‘కానీ, అమరావతి నగరం ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో ఒకటి అవుతుంది కాబట్టి పరిశ్రమ ఇక్కడ ఉండటమే సమంజసం’

ఇవి తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. రాష్ట్ర విభజన అయ్యిందగ్గర నుండి హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమ ఏపికి తరలి వెళిపోతుందని ఎందరో ప్రముఖులు ఎన్నో సార్లు చెప్పారు. కానీ విభజన జరిగి మూడున్నరేళ్ళయినా ఒక్క ఇంచైనా కదిలిందా? కదలలేదు. ఎందుకు కదలలేదు? అంటే, విభజన నాటి ఉద్రిక్త వాతావరణం ఇపుడు హైదరాబాద్ లో లేదు. పైగా సినీ పరిశ్రమ ప్రముఖులతో తెలంగాణా ప్రభుత్వం చాలా సన్నిహిత సంబంధాలు మెయిన్ టైన్ చేస్తోంది. దాంతో సినీ పరిశ్రమ పెద్దలు హైదరాబాద్ ను వదిలేసి ఏపికి రావాలని  అనుకోవటం లేదు. ఇది వాస్తవం.

పైగా, సినీ పరిశ్రమ మొత్తం ఏపికి తరలి వెళ్ళిపోవటానికి అక్కడేమీ సౌకర్యాలు కూడా లేవు. ఎప్పుడో విశాఖపట్నం జిల్లాలోని భీమిలీ వద్ద కొందరు పరిశ్రమ పెద్దలు స్టూడియోల కోసం స్ధలాలు కొన్ని పెట్టుకున్నారు. కొందరు నిర్మాణాలు చేసారు, మరికొందరు సన్నాహాల్లో ఉన్నారు. ఇంతలో హుద్ హుద్ వచ్చి అందరినీ దెబ్బ కొట్టేసింది. దాంతో చాలా మంది ఆలోచనను మానుకున్నారు. ఇక, అమరావతిని చూస్తే ఇప్పటికైతే అది కేవలం కాగితాలకే పరిమితమన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టే అమరావతి వైపు కూడా ఎవరూ చూడటం లేదు.

చంద్రబాబు ఆలోచనల ప్రకారమే సినీ పరిశ్రమ అమరావతికి వద్దామనుకుంటే అనుకుందాం కాసేపు. ఇప్పటికిప్పుడు అక్కడేమీ లేదు కదా? సౌకర్యాలు, వనరులు లేని చోటుకు సినీపరిశ్రమ ఎందుకు వస్తుంది? కనీసం మౌళిక సదుపాయాలన్నా ఏర్పాటయివుంటే అప్పుడు ఆలోచిస్తారు. చంద్రబాబు చెప్పినట్లుగానే ప్రపంచంలోని ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటవుతుందట. ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఎవరైనా చెప్పగలరా? ప్రపంచ దార్శినికుల్లో ఒకరైన చంద్రబాబు హయాంలోనే మూడున్నరేళ్ళల్లో రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పడలేదు.

అంటే, చంద్రబాబు మాటలు చూస్తుంటే, అటు విశాఖపట్నంలోనూ సినీ పరిశ్రమ అభివృద్ది చెందదు,  ఇటు అమరావతిలో అడుగు పెట్టే అవకాశం లేదు. కాబట్టి సినీ పరిశ్రమ పెద్దలు హైదరాబాద్ లోనే హ్యాపీగా గడిపేస్తారు.

 

click me!