ఏపీలో విపక్షాల కూటమికి చాన్స్: వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టేనా?

By narsimha lode  |  First Published May 8, 2022, 5:22 PM IST

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీ రాష్ట్రంలో విపక్షాల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉన్నట్టుగా కన్పిస్తుంది. అయితే ఏయే పార్టీల మధ్య పొత్తులుంటాయనే విషయమై ఇప్పుడే చెప్పలేం. వైసీపీని  గద్దె దింపాలంటే విపక్షాలు కలిసి రావాల్సిన అవసరం ఉందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. 


అమరావతి:2024లో Andhra Pradesh లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి విపక్ష పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉన్నట్టుగా విపక్షాలు సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఏయే పార్టీల మధ్య పొత్తులుంటాయనే విషయమై ఇప్పటికిప్పుడే మత్రం చెప్పలేం. రానున్న రోజుల్లో ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో YCP పాలనను అంతమొందించాల్సిన అవసరం ఉందని Janasena, TDP , బీజేపీలు ప్రకటించాయి. జనసేన  ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ ఏడాది మార్చి 14న గుంటూరు జిల్లాలో నిర్వహించిన సభలో జనసేన చీఫ్ Pawan Kalyan చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది.

Latest Videos

రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చూస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కార్ ఏర్పడకుండా ఉండాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలకు  బలం చేకూరేలా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా వ్యాఖ్యలు చేశారు.ఈ నెల 6వ తేదీన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో Chandrababu Naiodu పొత్తులపై వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో విపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై మెట్టు దిగుతామన్నారు. త్యాగాలకు కూడా సిద్దమని కూడా చంద్రబాబు ప్రకటించారు  ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఇవాళ స్పందించారు. Allianceపై చంద్రబాబు నేరుగా మాట్లాడితే తాను స్పందిస్తానన్నారు.వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. BJP తో తమ స్నేహం కొనసాగుతుందన్నారు. విశాల థృక్పథంతో  పని చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఎన్నికల సమయంలో అద్భుతం జరుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ అగ్రనేతలతో తనకు ఉన్న సంబంధాల గురించి కూడా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను కూడా తాను బీజేపీ అగ్రనేతల దృష్టికి కూడా తీసుకుపోతానని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా చర్చకు దారితీసింది.  పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వమే నిర్ణయిస్తుంది. 2014లో కూడా టీడీపీతో పొత్తును బీజేపీకి చెందిన Telangana నేతలు వ్యతిరేకించారు. కానీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ మాత్రం టీడీపీతొ పొత్తు పెట్టుకుంది. 

మరో వైపు ఏపీలో విపక్షాలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ రాస్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. టీడీపీతొ పొత్తు ఉండదనే సంకేతాలు ఇచ్చారు. జనసేనతో తమ ప్రయాణం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు విపక్షాల మధ్య పొత్తును నొక్కి చెప్పారు. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తుంది.

2004 లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత  బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకొంది. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొంది. అయితే 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో టీడీపీ పొత్తు తెగదెంపులు చేసుకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అనివార్య పరిస్థితి టీడీపీకి నెలకొంది, దీంతో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కూడా టీడీపీ అనివార్యంగా మారింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ స్థానాలు, టీడీపీకి 23, జనసేనకు ఒక్క సీటు దక్కాయి. సుమారు 15,688,569 లక్షల ఓట్లతో పాటు 49.95 శాతం ఓట్లతో వైసీపీ అధికారాన్ని దక్కించుకొంది. టీడీపీకి 12,304,668 ఓట్లు మాత్రమే వచ్చాయి.39.26 శాతం ఓట్లు టీడీపీకి దక్కాయి.జనసేనకు 1,736,811ఓట్లు వచ్చాయి. ఆ పార్టీకి 5.54 శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ వైసీపీ ఘన విజయం సాధించింది. మిగిలిన పార్టీలు ఈ ఎన్నికల్లో చతికిలపడ్డాయి. 

2014 ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఇందులో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు.2014లో టీడీపీకి 102 సీట్లు వచ్చాయి.2014లో జనసేన పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మాత్రమే మద్దతు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైసీపీని ఎదుర్కోవాలంటే విపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పార్టీలు భావిస్తున్నాయి. 

జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే విపక్షాలు కూటమి కుట్రను తెరమీదికి తెచ్చాయని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.చంద్రబాబును సీఎం చేసేందుకు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారని వైసీపీ విమర్శలు చేస్తుంది.  

ఇప్పటికే టీడీపీతో CPI  కలిసి పనిచేస్తుంది. సీపీఎం మాత్రం ఒంటరిగానే రాష్ట్రంలో కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. జనసేన, టీడీపీలు పొత్తులపై సానుకూలంగా ఉన్నాయి.అయితే ప్రస్తుతం పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తే వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు పొడిచే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.అయితే ఏయే పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందనే విసయమై ఇప్పటికిప్పుడే చెప్పలేం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున రాజకీయ పరిణామాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో విపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ విషయమై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది.
 

click me!