వచ్చే ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

Published : Sep 03, 2022, 02:54 PM IST
వచ్చే ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వివరించారు. త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.  

విశాఖపట్నం: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. త్వరలో జరగబోతున్న రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఎన్నికల్లో వైసీపీ ప్రకటించిన ఎలక్షన్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ తాము నెరవేరుస్తామని చెప్పలేదని, గొప్పలు చెప్పకున్నా అందులో 90 శాతానికి పైగా వాగ్దానాలను పూర్తి చేశామని వివరించారు. మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రతిష్టాత్మకమైన బల్క్ డ్రగ్స్ పార్క్ రాష్ట్రానికి వస్తున్నదని, కానీ, దీన్ని టీడీపీ జీర్ణించుకోవడం లేదని అన్నారు. ఈ బల్క్ డ్రగ్స్ పార్క్‌ను వద్దని టీడీపీ నేత యనమల కేంద్రానికి లేఖ రాయడం గర్హనీయం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫార్మా రంగానికి హబ్‌గా  రుతున్నదని, అందుకు దోహదపడే ఏ పరిశ్రమ వచ్చినా తాము స్వాగతిస్తామని వివరించారు.

టీడీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాబట్టి, వారిని ఈ రాష్ట్రం నుంచే వెళ్లగొట్టాలని అన్నారు. రాష్ట్ర విభజన హామీలను టీడీపీ కేంద్ర ప్రభుత్వానికి వదిలేసిందని, కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనత కేవలం చంద్రబాబుకే దక్కుతుందని వ్యంగ్యంగా మాట్లాడారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దని ఆర్బీఐకి టీడీపీ నేతలు లెటర్స్ రాశారని ఆరోపణలు చేశారు. అంతేకాదు, శాంతిభద్రతకు విఘాతం కలిగించే తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లను జైలుకు పంపాలని అన్నారు. వరద ప్రాంతాల పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడిన బాలిక మృతి చెందడం బాధాకరం అని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్