
నిద్రపోతున్న భర్తపై కత్తితో దాడి చేసి.. అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడిలో శుక్రవారం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బొక్కా సత్యనారాయణ అతని భార్య తులసి(55)..గొరగనమూడిలోని వారి కుమారుడు సోమన్నబాబు ఇంటి వద్ద ఉంటున్నారు. తులసి ఇరవై ఏళ్లుగా ఉదర సంబంధ సమస్యతో బాధపడుతోంది. కొడుకు తన భార్య గర్భవతి కావడంతో అత్తవారింటికి వెళ్లాడు. గత కొంతకాలంగా తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం ఆమెకు కలిగింది.
భర్తపై అనుమానం పెంచుకున్న ఆమె అదే అదనుగా భావించి.. సత్యనారాయణ గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూరగాయలు కోసే రెండు కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. సత్యనారాయణ కేకలు వేస్తూ బయటకు రాగా.. స్థానికులు భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం తులసి అదే ఇంట్లో తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు.