
ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఓ కుటుంబంలో అక్రమ సంబంధం చిచ్చు రేపింది. అమాయకంగా కనిపించే భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను కిడ్నాప్ చేయించడమే కాదు...దారుణంగా హత్య చేయించింది. దీంతో తల్లిదండ్రులకు దూరమై ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అర్ధవీడు మండలం నాగులవరానికి చెందిన నులక జగన్, రజనీలు భార్యభర్తలు. వీరికి ఇద్దరు మగపిల్లలు. వ్యాపారపనులు, పిల్లల చదువల నిమిత్తం వీరి కుటుంబం కంభం లో నివాసముండేవారు. భర్త జేసిబి, ట్రాక్టర్లను అద్దెకిచ్చే వ్యాపారం చేస్తుండేవాడు. దీంతో పగటిపూట రజని ఇంట్లో ఒంటరిగా వుండేది.
ఈ క్రమంలోనే రజనికి ఓ వైద్యుడితో పరిచయం ఏర్పడి అదికాస్తా అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కుటుంబంలో అలజడి ప్రారంభమయ్యింది. భార్యభర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి.
భార్య అక్రమ సంబంధం గురించి బయటపడినప్పటి నుండి భర్త ఆమెను ఓ కంట కనిపెడుతూ వచ్చాడు. దీంతో రజనీ తన ప్రియుడిని కలవడం కష్టంగా మారింది. ఇలాగయితే ఇక లాభం లేదని భావించిన రజని తన భర్త అడ్డు తొలగించకోవాలని భావించింది. దీనికోసం ప్రియుడితో కలిసి పథకం రచించింది.
మంగళవారం రాత్రి వైద్యుడి బంధువు ఒకరు జగన్ ఇంటికి వచ్చాడు. తాను కర్నూలులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి... డాక్టర్‌కు నీకు మధ్య ఉన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తానని నమ్మించి తనతో పాటు కారులో బయటకు తీసుకెళ్లాడు. మధ్యలో వైద్యుడు కూడా వీరితో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా చర్చల పేరుతో తీసుకెళ్లిన జగన్ అప్పటినుండి మళ్లీ కనిపించలేదు..
తన కుమారుడు కనిపించకపోవడంతో జగన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జగన్ ఇంటి వద్ద సిసి పుటేజీలను పరిశీలించి జగన్ భార్యతో పాటు వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రస్తుతం కంభం పోలీసుస్టేషన్‌లలో విచారిస్తున్నట్లు సమాచారం.
కిడ్నాప్ కు గురైన జగన్ ను నిందితులు దారుణంగా హతమార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం బయటపడితే కంభంతో పాటు మృతుడి స్వగ్రామంలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం వుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను విచారిస్తున్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా బందోబస్తును పెంచారు.