
అనుమానంతో తనను నిత్యం వేధిస్తున్న భర్తను హతమార్చిందో భార్య. వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సపర్లకు చెందిన కొర్ర కృష్ణారావు, గెమ్మిల వీరమ్మ దంపతులు. వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే గత బుధవారం గొడవ తీవ్ర రూపు దాల్చడంతో వీరమ్మ ఆవేశంలో భర్త కృష్ణారావును గొడ్డలితో తలపై మోదింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావును స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు.
దీనిపై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారావుకు గతంలోనే పెళ్లై ముగ్గురు పిల్లలు వున్నారు. ఇతని భార్య రెండేళ్ల క్రితం మరణించడంతో అదే గ్రామానికి చెందిన వితంతువు వీరమ్మను కృష్ణారావు పెళ్లాడాడు. వీరి కాపురం కొంతకాలం సజావుగానే సాగినప్పటికీ తన మొదటి భార్య పిల్లలను వీరమ్మ సరిగా చూసుకోవడం లేదనే అనుమానంతో వీరమ్మను కృష్ణారావు వేధించేవాడు.
ఇదే విషయంగా నిత్యం గొడవ పడేవాడు. దీంతో పిల్లలను ఆసుపత్రిలో చేర్చించిన వీరమ్మ.. చట్రపల్లిలోని తన పిన్ని ఇంట్లో వుంటోంది. ప్రతినిత్యం గొడవ పడటంతో పాటు అతని వేధింపులు భరించలేక భర్త అడ్డు తొలగించుకోవాలని వీరమ్మ భావించింది. ఈ నేపథ్యంలోనే కృష్ణారావు తలపై గొడ్డలిపై మోదింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు వీరమ్మను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.