
కాకినాడ: ప్రియుడి మోజులో కట్టుకొన్న భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకొంది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు మండలం చింతలూరులో బుధవారం నాడు జరిగింది.
చింతలూరుకు చెందిన 37 ఏళ్ల వరహాలుకి గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన మంగతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నారు. పెళ్లైన నుండి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
మద్యానికి బానిసగా మారిన వరహాలు భార్యను వేధింపులకు గురి చేసేవాడు. తన స్వగ్రామానికి చెందిన జింకల మణికంఠ అలియాస్ స్వామితో మంగకు వివాహేతర సంబంధం ఉంది. స్వామి వరుసకు ఆమెకు కొడుకు అవుతాడు.
ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. భర్తను అడ్డు తొలిగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంగ భావించింది. దీంతో ప్రియుడు స్వామితో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది. బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి ఆమె హత్య చేసింది.
ఆ తర్వాత డెడ్ బాడీని సమీపంలో వేశారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉండడంతో మృతుడి కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. స్వామిని స్థానికులు చితబాదారు. చంపుతామని హెచ్చరించారు. దీంతో తామే వరహాలును హత్య చేశామని ఒప్పుకొన్నారు.
మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబం పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.