
గుంటూరు: వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఓ భార్య. తాళికట్టిన భర్తను చెమ్మచీకటిలో హత్య చేసి కాటికి పంపింది. అనైతిక బంధాల వ్యామోహంతో భర్తను పొట్టనపెట్టుకుని మూడుముళ్ల బంధానికి కలంకం తీసుకువచ్చింది.
పొద్దంతా పనిచేసి అలసిపోయిన భర్త నిద్రపోతున్న సమయంలో అతని మర్మాంగంపై రోకలితో మోది గొంతు నులిమి ప్రాణాలు తీసేసింది. ఆలుమగల బంధాన్ని బుగ్గిగా మార్చిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం సిరింగిపురానికి చెందిన చుక్కా రత్నబాబు అదే గ్రామానికి చెందిన స్వర్ణలతతో తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది. వారికి కుమారుడు డేవిడ్ (7), కుమార్తె షైనీ(5) ఉన్నారు. రత్నబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. వేర్వేరు ప్రాంతాల్లో రత్నబాబు పనిచేసేందుకు వెళ్లి రాత్రి ఎప్పటికో వస్తాడు.
అయితే భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని స్థానికుల ద్వారా తెలుసుకున్న రత్నబాబు అనేక సార్లు వారించాడు. వివాహేతర సంబంధంపై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం పంచాయితీ వరకు వెళ్లింది. పెద్దలు నచ్చచెప్పడంతో సర్దుకుపోయాడు. పిల్లలిద్దరు చిన్నవాళ్లు కావడంతో వారిని చూసుకుంటే చాలనే ఉద్దేశ్యంతో ఆమెతో కాపురం చేస్తున్నాడు రత్నబాబు.
ఎన్నిసార్లు చెప్పినా, పంచాయితీలో పెట్టినా భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన రత్నబాబు భార్యను శుక్రవారం రాత్రి మందలించాడు. పద్దతి మార్చుకోవాలని సూచించాడు. భర్త మందలించడాన్ని తట్టుకోలేకపోయిన స్వర్ణలత ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తను ఎలాగైనా అంతమెుందించాలని నిర్ణయించుకుంది.
తాపీపని చేసి అలసిపోయి వచ్చిన భర్త ఆదమరచి నిద్రపోతున్న సమయంలో రోకలి బండతో అతని మర్మాంగాల మీద మోదింది. ఇంకా బ్రతికి ఉండటంతో వంటకు ఉపయోగించే పదునైన గరిటెతో గాట్లు పెట్టింది. అయినా చనిపోకపోవడంతో గొంతు నులిమి హత మార్చింది. రత్నబాబును భార్య హతమార్చిందని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసరావుపేట రూరల్ డీఎస్పీ నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు, రత్నబాబు, స్వర్ణలత బంధువులను విచారించారు. అయితే తన భర్తను తానే హత్య చేసినట్లు స్వర్ణలత ఒప్పుకోవడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రత్నబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇద్దరి పిల్లలతో ఆ కుటుంబం ఎంతో సందడిగా ఉండేదని అయితే వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చీకటి నింపిందని స్థానికులు చెప్తున్నారు. వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో కష్టసుఖాల్లో తోడుంటున్న భర్తను చంపి జైలు పాలయ్యింది స్వర్ణలత. అటు తండ్రిని కోల్పోయి, తల్లి జైలు పాలవ్వడంతో ఆణిముత్యాల్లాంటి ఇద్దరి పిల్లలు అనాథలయ్యారు.
వ్యామోహంతో క్షణికావేశంలో ఆమె చేసిన పని నలుగురు జీవితాలను నాశనం చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి చనిపోవడంతో బోరున విలపించాలో లేక తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని ఏడాలో తెలియక ఆ చిన్నారులు చూస్తున్న అమాయక చూపులు అందర్నీ కలచివేస్తున్నాయి.