
లోకేష్ దారి రహదారి కాదా? మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెడదామని అనుకుంటున్నలోకేష్ ను రహదారిలో కాకుండా దొడ్డిదారిలో అడుగుపెట్టించాలని చంద్రబాబు ఎందుకు నిర్ణయించారు? ముందు ఎంఎల్సీగా నియమించి తర్వాత మంత్రిని చేయాలని చంద్రబాబునాయుడు ఆలోచన. అసెంబ్లీ సీట్లేవీ ఖాళీ లేకపోవటంతో శాసనసభ్యుల కోటాలో ఎంఎల్సీని చేయాలని చంద్రబాబు అనుకున్నారట. అయితే, ఇదే టిడిపి నేతలు ఎంఎల్సీ అయిన రోశయ్యను ఒకపుడు ‘దొద్దిదోవ’ అని ఎగతాళి చేసినవారే. మరి అదే దొడ్డిదోవలో తమ యువరత్నం నారా లోకేష్ బాబును ఎందుకు పంపుతున్నారో? లోకేష్ కోసం తాము రాజీనామా చేస్తామంటూ చాలామంది ఎంఎల్ఏలు బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా? ఏవరో ఒక ఎంఎల్ఏని రాజీనామా చేయించి ఆ స్ధానంలో లోకేష్ ను నిలబెట్టవచ్చుకదా?
టిడిపి వ్యవహారం చూస్తుంటే రాష్ట్రం మొత్తం మీద తమకు బాగా సేఫ్ అనుకున్న నియోజకవర్గమే దొరకలేదా అన్న అనుమానం వస్తోంది. లోకేష్ ను శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపిస్తే తమకు ప్రజాబలం వుందన్న విషయం కూడా రుజువు చేసుకున్నట్లుంటుంది. ఎలాగూ 80 శాతం ప్రజలు తన పాలన పట్ల సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. మరింకెందుకు ఆలోచన? చట్టసభల్లోకి ప్రవేశించటం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి అడుగుపెడుతున్నపుడు రాజబాటలో కాకుండా దొడ్డిదోవ ఎందుకు? అధికారంలో ఉన్నారు, పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గాలున్నాయి, సుమారు 80 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల బలమున్న పార్టీలో నారా లోకేష్ కు గెలుపును ఖాయంగా అందించే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కూడా కనబడలేదా?